రవీంద్రభారతి, ఫిబ్రవరి 20: ‘తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్లో రాష్ట్ర జనాభాలో 61 శాతానికి పైగా ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ వివక్షకు నిరసనగా, వచ్చే బడ్జెట్లోనైనా జనా భా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ నెల 27న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీసీల ఆక్రందన దీక్ష చేపట్టనున్నాం’ అని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్‌గౌడ్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబా ద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బడ్జెట్ గణాంకాలను విశ్లేషించి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. 21 బీసీ కార్పొరేషన్లకు గత బడ్జెట్లో కేటాయించిన రూ.440 కోట్లల్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.
బీసీల కోసం ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్న ప్రభుత్వం.. రెండేండ్లలో ఖర్చు చేసింది రూ.2,060 కోట్లు మాత్రమేనని విమర్శించా రు. కాంట్రాక్టర్లకు 70 వేల కోట్లు చెల్లిస్తున్న ప్రభుత్వం.. విద్యార్థుల చదువుల కోసం అవసరమైన రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవ డం శోచనీయమని పేర్కొన్నారు. ఏపీ తరహా రాష్ట్రంలో సబ్‌ప్లాన్ ద్వారా 50వేల కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 27న జరిగే నిరసన దీక్షకు బీసీ మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గయ్యగౌడ్, రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్నగౌడ్, బైరు శేఖర్ గంగపుత్ర, ఎలికట్ట విజయ్‌కుమార్, అంబాల నారాయణ పాల్గొన్నారు.