Impeachment : అవినీతికి పాల్పడిన అలహాబాద్ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma)పై వేటు పడనుంది. భారీగా నోట్ల కట్టలు పట్టుబడిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయనపై అభింశసన (Impeachment) తీర్మానాన్ని పెట్టారు పలువురు ఎంపీలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజునే పార్టీలకతీతంగా ఇరు సభల్లోని 200ల మంది మోషన్‌పై సంతకాలు చేశారు. అనంతరం ఆ పత్రాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217, 218 కింద జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టారు. ఈ మోషన్‌కు బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ ఎంపీలతో పాటు సీపీఎం సభ్యులు కూడా మద్దతు తెలిపారు. అభిశంసన తీర్మానంపై సంతకాలు చేసిన వాళ్లలో రవిశంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీ, సుప్రియా సూలే, కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. ఎగువ సభలోనూ జస్టిస్ వర్మను తొలగించాలని తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు ఎంపీలు. 50 మంది ఆయనను తొలగించాలని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ను కోరారు.
ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు దొరికిన వీడియోలు వైరలైన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న సమయంలో మార్చి 14వ తేదీన అతని ఇంటిలో రూ.500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాంతో, ఆయనపై చర్యలకు ఆదేశించిన సుప్రీంకోర్టు.. ఇన్‌హౌజ్ కమిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్, హర్యా హైకోర్టు చీఫ్ జస్టిస్ శీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జీఎస్ సంధవాలియా, కర్నాటక హైకోర్టు జస్టిస్ అను శివరామన్‌తో కూడిన కమిటీ ఓ నివేదికను మే 4వ తేదీన విడుదల చేసింది. అయితే.. కమిటీ నివేదికను కూడా జస్టిస్ యశ్వంత్ సవాల్ చేశారు.