MK Stalin | తమిళనాడు ప్రజలకు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) కీలక విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ప్రజలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్న కుటుంబ నియంత్రణ చర్యలు ఇప్పుడు ప్రతికూల స్థితిలో ఉంచాయని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమిళనాడు రాష్ట్రం 8 ఎంపీ స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రజలు ఆలస్యం చేయకుండా తన విజ్ఞప్తి మేరకు వెంటనే పిల్లల్నికనాలని పిలుపునిచ్చారు.
కాగా, గతంలోనూ స్టాలిన్ ఇలాంటి విజ్ఞప్తే చేశారు. రాష్ట్ర ప్రజలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 16 రకాల సంపదలకు బదులుగా 16 మంది పిల్లలను కనాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. పరిమితంగా పిల్లలను కని సంపదతో జీవించాలనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రణ ప్రచారాన్ని చేపట్టామన్నారు. దీని కారణంగా రానున్న కాలంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు లోక్‌సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఏర్పడిందన్నారు.
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం
దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ (delimitation) సెగ రాజుకుంటున్నది. వచ్చే పార్లమెంట్ఎన్నికల నాటికి లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్రం భావిస్తోంది. కేంద్రం అనుసరించబోతున్న ఈ విధానంపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం భారీగా లాభపడతాయని ఐదు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల నేతలు మండిపడుతున్నారు.
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ వద్దు..
కేవలం జనాభా ఆధారంగా దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ సీట్లను (population-based delimitation) నిర్ణయించరాదు అని కేంద్రాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(CM MK Stalin) ఇటీవలే కోరారు. ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగితే, దాన్ని ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా తమ రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరిగినా సహించేది లేదన్నారు. మా డిమాండ్ చాలా స్పష్టంగా ఉందని, కేవలం జనాభా ఆధారంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగవద్దు అని, జనాభా నియంత్రణకు దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర చర్యలు తీసుకున్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా ఆ రాష్ట్రాలను శిక్షించవద్దు అని కేంద్రానికి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.
ఎక్కువమంది పిల్లల్ని కనండి.. ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇటీవలే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. జనాభా సమతుల్యతపై వృద్ధాప్య జనాభా ప్రభావంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలని చంద్రబాబు కోరారు. ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అనుమతించే చట్టాన్ని తెచ్చేందుకు తమ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నదని వెల్లడించారు.
Also Read..
Madhabi Puri Buch | స్టాక్ మార్కెట్ మోసాల కేసు.. సెబీ మాజీ చీఫ్‌కు కాస్త ఊరట
Ola Electric | 1,000 మందిపై వేటుకు సిద్ధమైన ఓలా ఎలక్ట్రిక్.. ఐదు నెలల్లోనే రెండో రౌండ్ లేఆఫ్స్
PM Modi | కెమెరా చేతపట్టి లయన్ సఫారీకి వెళ్లిన ప్రధాని మోదీ.. ఫొటోలు వైరల్