Conrad Sangma : హనీమూన్ ట్రిప్ (Honeymoon trip) కోసం భార్యతో కలిసి తమ రాష్ట్రానికి వచ్చి మధ్యప్రదేశ్ కు చెందిన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్యకు గురైన ఘటనపై తమ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని మేఘాలయ సీఎం (Meghalaya CM) కాన్రాడ్ సంగ్మా (Conrad Sangma) అన్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తమ పోలీసుల దర్యాప్తులో తేలుతాయని ఆయన చెప్పారు.
అయితే ఈ హత్య కేసులో అరెస్టయిన నిందితుల్లో ఒక్కరు కూడా మేఘాలయ రాష్ట్రానికి చెందినవారు కాదని, అయినా కూడా మేఘాల ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని అకారణంగా నిందిస్తున్నారని కన్రాడ్ సంగ్మా వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రం చాలా సురక్షితమైన రాష్ట్రమని, తాము పర్యాటకులను గౌరవిస్తామని అన్నారు.
ఏదేమైనా తమ రాష్ట్రంలో ఓ టూరిస్టు హత్యకు గురికావడం బాధాకరమైన విషయమని, ఈ హత్య కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు అరెస్టయ్యారని సంగ్మా చెప్పారు. అందరినీ మేఘాలయకు రప్పించి సమగ్రంగా దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ దంపతులు ఈ నెల 20న మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. మే 23న ఆ జంట అదృశ్యమైంది.
జూన్ 2న ఓ లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. సోమవారం తెల్లవారుజామున సోనమ్ రఘువంశీ యూపీలో పోలీసుల ముందు లొంగిపోయింది. అయితే భార్య సోనమ్ భర్తను హత్య చేయిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆమె మాత్రం తనను కాపాడే క్రమంలో తన భర్త దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడని సోనమ్ చెబుతోంది.