MAX app : ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే కొన్ని యాప్స్‌ను చైనా (China) నిషేధించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా వాట్సప్ (WatsApp) వినియోగంపై చైనాలో నిషేధముంది. అక్కడ వాట్సాప్‌కు బదులుగా ‘వి చాట్’ లాంటి ప్రత్యామ్నాయ యాప్స్‌ను అందుబాటులో ఉంచింది. ఇప్పుడు చైనా బాటలోనే రష్యా నడుస్తోంది. అయితే రష్యాలో వాట్సప్‌ను నిషేధించలేదుగానీ దానికి ప్రత్యామ్నాయంగా ‘మాక్స్ (MAX)’ పేరుతో ఓ కొత్త మయాప్ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు దాన్ని బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
విదేశీ డిజిటల్ సర్వీసులపై ఆధారపడకుండా సొంత డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడం, వాటిని బలోపేతం చేయడంపై రష్యా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే వాట్సప్ బదులుగా మ్యాక్స్ యాప్ వినియోగాన్ని పెంచాలని నిర్ణయించింది. ఇకపై దేశంలో తయారు చేసే ప్రతి మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్లో ‘మ్యాక్స్’ను ప్రీ-ఇన్స్టాల్ యాప్‌గా ఉంచాలని రష్యా ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే పలు యాప్స్ ప్రీ-ఇన్‌స్టాల్‌గా వస్తున్నాయి. వాటిలో ‘మ్యాక్స్’ను చేర్చాలని సూచించింది. ఆ యాప్‌లో ప్రభుత్వ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు అంటున్నారు.
ఈ మాక్స్ యాప్‌ను ప్రభుత్వరంగ సంస్థ వీకే రూపొందించిందని, అందువల్ల యూజర్ల డేటాపై ప్రభుత్వం నిఘా పెట్టే అవకాశాలున్నాయని విమర్శలు వస్తున్నాయి. వాటిని అక్కడి ప్రభుత్వం ఖండించింది. వాట్సప్, టెలిగ్రామ్ కన్నా ‘మ్యాక్స్’కు పరిమిత యాక్సెస్ ఉంటుందని, నిఘా పెట్టే అవకాశం లేదని స్పష్టంచేసింది. ఈ యాప్‌తోపాటు సెప్టెంబర్ ఒకటి నుంచి రష్యాలో తయారయ్యే యాపిల్ ఫోన్లలో దేశీయ యాప్‌స్టోర్ అయిన ‘రూ స్టోర్’ను కూడా ప్రీ-ఇన్స్టాల్ యాప్ జాబితాలో చేర్చాలని ఆదేశించింది.
వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ‘లైమ్ హెచ్డీ టీవీ’ యాప్‌ను కొత్త టీవీల్లో కచ్చితంగా ప్రీ-ఇన్స్టాల్ చేయాలని పేర్కొంది. దాని ద్వారా ప్రభుత్వ టీవీ ఛానళ్లను ఉచితంగా ప్రసారం చేసే అవకాశం ఉంది.