Manoj Jarange | మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. పలు పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ విషయమై మరాఠా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న మనోజ్ జరాంగే పాటిల్ (Manoj Jarange Patil) యూటర్న్ తీసుకున్నారు. ‘మహా’ ఎన్నికల నుంచి వైదొలిగారు.
కాగా, నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly elections) తమ అభ్యర్థులు పోటీ చేస్తారని మనోజ్ జరాంగే ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. తన పార్టీ తరఫున ఏడుగురు అభ్యర్థులను పోటీ చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అదేవిధంగా మరో ఆరు నియోజకవర్గాల్లో అధికార పార్టీ కూటమి అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. మరో 2 నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, గంటల వ్యవధిలోనే యూటర్న్ తీసుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల నుంచి వైదొలిగారు.
‘ఒకే కులం బలంతో ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అసాధ్యం. మనం రాజకీయాల్లోకి కొత్త. అభ్యర్థిని నిలబెట్టి ఓడిపోతే ఆ కులానికి అవమానం. అందుకే మరాఠా అభ్యర్థులందరినీ అభ్యర్థిస్తున్నాను.. తమ నామినేషన్లను ఉపసంహరించుకోండి’ అని అన్నారు. మరాఠాలకు న్యాయం చేయని వారిపై మాత్రమే పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
కాగా, విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి (Maratha quota) రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతంగా సాగిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలకు సామాజిక కార్యకర్త అయిన మనోజ్ జరాంగే నేతృత్వం వహించారు. గతేడాది నుంచి ఏకంగా ఆరుసార్లు నిరాహార దీక్షకు దిగారు. అప్పటి నుంచి ఆయన పేరు నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. ఈ దీక్షతో దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనతో చర్చలు కూడా జరిపింది.
జరాంగే ఉద్యమం కారణంగా ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ‘మహాయతి’ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో తాజా అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన మద్దతు కోసం వివిధ పార్టీలు క్యూ కట్టాయి. ఈ క్రమంలో ఆయన అనూహ్య నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 20న ఎన్నికలు నిర్వహించనుండగా.. 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
Also Read..
Bus Accident | లోయలో పడిపోయిన బస్సు.. ఐదుగురు మృతి
Assembly Speaker | జమ్ము కశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌గా అబ్దుల్ రహీమ్ రాథర్
Air Pollution | డేంజర్ బెల్స్.. ఢిల్లీలో 400 మార్క్‌ను దాటిన గాలి నాణ్యత