Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం (Air Pollution) డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతుండటంతో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించిపోతోంది. సోమవారం రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత అధ్వానస్థితికి చేరింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) 400 మార్క్‌ను దాటేసింది. ఏక్యూఐ 400 దాటితే అది ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board) ప్రకారం.. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఆనంద్ విహార్‌లో 433, వజీర్‌పూర్‌లో 414, జహంగీర్‌పురిలో 413, రోహిణి ప్రాంతంలో 409, పంజాబీ బాగ్‌లో 404గా గాలి నాణ్యత నమోదైంది. పలు ప్రాంతాల్లో 400 కంటే ఎక్కువ స్థాయిల్లో ఏక్యూఐ నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.
ఆగ్రా, నోయిడాతోపాటు ఢిల్లీ ఎన్సీఆర్లో దట్టంగా పొగ కమ్ముకున్నది. కాలుష్యం ధాటికి తాజ్‌మహల్ కనిపించకుండా పోయింది. గత 10 నుంచి 12 రోజుల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక యమునా నది నురగలు కక్కుతున్నది. పెద్దమొత్తంలో నురగ నదిపై ప్రవహిస్తున్నది. కాగా రానున్న మూడు రోజుల్లో రాజధాని పొగ మంచు కమ్మేసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గాలి వేగం గంటకు 10 కిమీ కంటే తక్కువగా ఉంటుందని.. ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.
కాగా, దేశ రాజధానిలో దీపావళి రాత్రి అధిక స్థాయిలో వాయు కాలుష్యం నమోదైంది. పలు ప్రాంతాల్లో ఏక్యూఐ రీడింగ్‌లు గరిష్ఠ సాయి 999కి చేరాయి. ఏక్యూఐ 507 పాయింట్లకు చేరితే ప్రమాదకర స్థాయి కాలుష్యంగా పరిగణిస్తారు. ఈ గాలి పీల్చితే ప్రజలకు శ్వాసకోశ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు గాలి కాలుష్యానికి తోడు ఢిల్లీ అంతటా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విషవాయువును పీల్చుకుంటున్న ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. అయితే, గత కొంతకాలంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకరంగా మారుతోన్న విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలపెట్టడానికి తోడు.. మంచు రాజధానిని కమ్మేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కాలుష్య నియంత్రణకు పాలకులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ కారణంగా నగర వాసులు తీవ్ర అనారోగ్య సమసల్యకు గురికావాల్సి వస్తోంది.
Also Read..
Toll Plaza | త్వరలో టోల్ ప్లాజాలకు చెల్లు.. అందుబాటులోకి ఎంఎల్ఎఫ్ఎఫ్ టోల్ కలెక్షన్ సిస్టం
Maharashtra Elections | మరాఠీల ఓట్ల కోసం మూడు సేనల పోరు.. తేలనున్న ఠాక్రే వారసత్వం
Himalayan Lakes | వాతావరణ మార్పులు.. విస్తీర్ణం పెరుగుతున్న హిమాలయ సరస్సులు