Toll Plaza | న్యూఢిల్లీ, నవంబర్ 3: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలు త్వరలో కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో వాహనదారుల నుంచి టోల్ ఫీజును వసూలు చేసేందుకు ఫీల్డ్ ఎక్విప్మెంట్, సెన్సర్లతో కూడిన సరికొత్త మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (ఎంఎల్ఎఫ్ఎఫ్) టోల్ కలెక్షన్ వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి. రహదారులపై వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు సాగేందుకు వీలుగా భౌతిక టోల్ ప్లాజాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్న జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ).. దేశంలోనే తొలిసారి ఢిల్లీలోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై ఎంఎల్ఎఫ్ఎఫ్ టోల్ కలెక్షన్ వ్యవస్థ ద్వారా టోల్ ఫీజును వసూలు చేసేందుకు బ్యాంకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
ఈ ప్రణాళిక విజయవంతమైతే మొత్తం 28 కి.మీ. పొడవు ఉండే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక్క టోల్ ప్లాజా మాత్రమే ఉంటుంది. ఆ రహదారిపై ప్రయాణించే వాహనాల నుంచి ఎంఎల్ఎఫ్ఎఫ్ టోల్ కలెక్షన్ వ్యవస్థ సేకరించి, పంపే డాటా ఆధారంగా సదరు వినియోగదారుల ఫాస్టాగ్ వాలెట్ నుంచి బ్యాంకే టోల్ ఫీజును రాబడుతుంది. ఒకవేళ టోల్ ఫీజును చెల్లించకపోతే ఆ విషయం వెహికల్ పోర్టల్‌తోపాటు ఫాస్టాగ్ యాప్‌లో కనిపిస్తూ ఉంటుంది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై ఎంఎల్ఎఫ్ఎఫ్ టోల్ కలెక్షన్ వ్యవస్థ విజయవంతమైతే ఇతర ఎక్స్‌ప్రెస్‌వేలపై ఏర్పాటు చేయాలని ఎన్హెచ్ఏఐ భావిస్తున్నది.