Maharashtra Elections | ముంబై: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మరాఠీల ఓట్ల కోసం మూడు సేనలు పోటీ పడుతున్నాయి. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలోని శివసేన (యూబీటీ), రాజ్ ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన మరాఠీల మనసులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఈ ఓట్లు మొదటిసారి మూడుగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్ ఠాక్రే పార్టీ ప్రభావం ఉద్ధవ్ నేతృత్వంలోని పార్టీపై ప్రతికూలంగా పడవచ్చునని విశ్లేషకులు చెప్తున్నారు. మరాఠీల ఓట్లు చీలడం వల్ల ఎక్కువగా లాభపడేది బీజేపీయేనని అంటున్నారు.
రాజ్ ఠాక్రే రంగ ప్రవేశంతో..
2009 లోక్ సభ ఎన్నికల్లో రాజ్ ఠాక్రే పార్టీ వల్ల ముంబై, థాణే, నాసిక్ ప్రాంతాల్లోని చాలా స్థానాల్లో బీజేపీ-శివసేన కూటమికి గట్టి దెబ్బ తగిలింది. ఫలితంగా కాంగ్రెస్ లాభపడింది. రాజ్‌కు కనీసం ఒక స్థానమైనా దక్కలేదు. ప్రస్తుత ఎన్నికల్లో శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్‌పవార్), కాంగ్రెస్ మహా వికాస్ అఘాఢీగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ, శివసేన (ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలు మహాయుతిగా పోటీ చేస్తున్నాయి. ముంబై, దాని పరిసర నియోజకవర్గాల్లో శివసేన, శివసేన (యూబీటీ) పోటీ పడుతుండగా, ఆ స్థానాల నుంచే ఎంఎన్ఎస్ కూడా తన అభ్యర్థులను బరిలో దించింది. కొంత కాలంపాటు ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్న రాజ్ ఠాక్రే ప్రస్తుతం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. తన కుమారుడు అమిత్‌ను బరిలో దించారు.
మహిమ్, వర్లిలో పోటాపోటీ
మహిమ్ నియోజకవర్గంలో ఈ మూడు సేనల మధ్య ముక్కోణ పోటీ హోరాహోరీగా జరగబోతున్నది. అమిత్ ఠాక్రే (ఎంఎన్ఎస్), సదా సర్వంకర్ (శివసేన), మహేశ్ సావంత్ (శివసేన-యూబీటీ) ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అదే విధంగా వర్లిలో కూడా రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఇక్కడి నుంచి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే (శివసేన-యూబీటీ), సందీప్ దేశ్‌పాండే (ఎంఎన్ఎస్ సీనియర్ నేత), మిలింద్ దేవ్రా (శివసేన) పోటీ చేస్తున్నారు. అమిత్, ఆదిత్య సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.