హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మార్పు వస్తుందని, తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన 5 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిరాశే ఎదురవుతున్నది. ‘ప్రజా ప్రభుత్వం’ అని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి సరార్, ఆర్థికభారం నెపంతో వేల సంఖ్యలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రోడ్డున పడేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వరర్లతో కలిపి దాదాపు 5 లక్షల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. బడ్జెట్ సాకులు చూపుతూ ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, ట్రెజరీ, ఇరిగేషన్, మిషన్ భగీరథ, రెవెన్యూ, మెడికల్, బీసీ వెల్ఫేర్ వంటి దాదాపు 45 కీలక శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఇటీవల ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నది.
ఏండ్ల తరబడి సేవలు అందించిన తమను ఇలా మధ్యలో వదిలేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి శాఖ నుంచి సగటున 15 నుంచి 20 మంది ఉద్యోగులను తొలగించారు. ట్రెజరీలో 80 మంది ఉంటే అందరినీ తీసేశారు. మున్సిపల్ ఎన్నికల ముందు 5 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఓట్లపై కన్నేసిన కాంగ్రెస్ సర్కార్, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తామని, నేరుగా వారి అకౌంట్లలో జీతాలు జమ చేస్తామని మీడియా ద్వారా లీకులు ఇచ్చిందని ఔట్సోర్సింగ్ జేఏసీ ఆరోపిస్తున్నది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో 2026-27కు సంబంధించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ పూర్తిస్థాయి బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నది. దళారీ ఏజెన్సీలను రద్దు చేసి ప్రతినెలా ఒకటో తేదీనే అకౌంట్లలో జీతాలు వేస్తామని ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ప్రకటించాలని కోరుతున్నది.
ఆమరణ దీక్షకు వెనుకాడబోం
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏజెన్సీల పేరుతో జరుగుతున్న శ్రమ దోపిడీ, బానిసత్వాన్ని నివారించాలి. ప్రతి ఔట్సోర్సింగ్ ఉద్యోగి వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో నమోదు చేయాలి. శాశ్వత ఉద్యోగుల తరహాలోనే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకూ రూ.కోటి ప్రమాద బీమా వర్తింపజేయాలి. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. లేనిపక్షంలో రిలే నిరాహార దీక్షలు చేపడ్తాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకూ వెనుకాడబోం.
-పుల్లగుర్ల రాజిరెడ్డి, రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్