వరంగల్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి ధన్యజీవి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లిలో సోమవారం నిర్వహించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభలో మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. పెద్ది చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. చమర్చిన కండ్లతో పెద్ది చిత్రపటంపై పూలు జల్లారు. నివాళులర్పించే సమయంలోనూ ఉద్విగ్నతకు గురయ్యారు.
అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. పెద్ది కుమారుడు, కూతురును దగ్గరికి తీసుకొని హత్తుకున్నారు. పెద్ది కుటుంబ సభ్యులు, సోదరులను పేరుపేరునా పలకరించారు. పెద్ది సతీమణి స్వప్నకు ధైర్యవచనాలు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో మాట్లాడారు. ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదని ఎలా బతికామన్నదే ముఖ్యమని తెలిపారు. పెద్ది అంతిమయాత్రకు లక్షలాదిగా తరలివచ్చిన జనమే ఆయన ప్రజాజీవితానికి నిదర్శనమని పేర్కొన్నారు. పెద్ది గెలిచింది ఒక్కసారే అయినా జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాడని కొనియాడారు. తెలంగాణ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోరాటాలకు నాయకత్వం వహించిన మహోన్నత ప్రజా నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కేటీఆర్ గుర్తుచేశారు.
పెద్ది అంతిమ యాత్ర తర్వాత హైదరాబాద్‌లో తనను కలిసిన వారు ‘ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదు.. పదిసార్లు ఎమ్మెల్యే కాదు. ఎందుకు అన్నా అంతమంది ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు? 12 గంటల పాటు జనయాత్ర జరిగింది?’ అని అడిగారని పేర్కొన్నారు. అప్పుడు వారికి పెద్ది సుదర్శన్‌రెడ్డి వరంగల్ జిల్లాలో ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడని, అందుకే ఓరుగల్లు మొత్తం కదిలివచ్చి పెద్దన్నను చివరిసారిగా చూసుకున్నదని’ అని తాను బదులిచ్చిన విషయాన్ని కేటీఆర్ వివరించారు. ‘ఉద్యమ పవర్ అంటే అది అని, ఉద్యమ బిడ్డకు.. ఉద్యమ గడ్డ ఇచ్చిన గౌరవం అది’ అని తాను పేర్కొన్నట్టు చెప్పారు.

పెద్ది కోరుకున్నట్టుగా రెండేండ్ల తర్వాత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెట్టడం ఖాయమమని కేటీఆర్ వెల్లడించారు. నర్సంపేట చర్రితలో పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా, భావితరం గుర్తుంచుకునేలా శాశ్వత కీర్తి ఉండేలా ఘనమైన నివాళులు అర్పిస్తామని పేర్కొన్నారు. నర్సంపేట మెడికల్ కళాశాలలో పుట్టిన ప్రతిబిడ్డ, పాకాలలో దుంకిన గోదావరి జలాలు.. గలగల పారే ప్రతి నీటి బొట్టూ పెద్ది సుదర్శన్‌రెడ్డిని గుర్తుంచుకుంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.
పెద్ది అస్వస్థతకు గురైన సమయంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రీన్‌చానల్ ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు తరలించామని, అమెరికా, లండన్‌లోని నిపుణులైన వైద్యుల సలహాలు తీసుకుంటూ కాపాడుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డినా ఫలితం దకలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది జనం మధ్య సాగిన ఆయన చివరి ప్రయాణమే ఆయన సార్థక జీవితానికి అసలైన కొలమానమని కేటీఆర్ కొనియాడారు. రాష్ట్రంలో ఏ నియోజవర్గంలో లేని విధంగా నర్సంపేట పట్టణంలో ఇంటింటికీ గ్యాస్ ఇచ్చిన ఘనత పెద్ది సుదర్శన్రెడ్డిదే అని కొనియాడారు. పెద్ది కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని కేటీఆర్ తెలిపారు. పెద్ది భార్య స్వప్న, వారి పిల్లలు, కుటుంబసభ్యులకు కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అధికారంలోకి రాగానే పెద్ది ఆశయాలకు అనుగుణంగా నర్సంపేటను మరింత అభివృద్ధి చేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శాసనమండలిలో విపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, డాక్టర్ టీ రాజయ్య, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, వొడితెల సతీశ్‌కుమార్, గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, జీవన్‌రెడ్డి, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, వై సతీశ్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, బొల్లం సంపత్‌కుమార్, లింగంపల్లి కిషన్‌రావు, గాంధీనాయక్, అజయ్‌కుమార్, జడ్పీ మాజీ చైర్మన్లు సాంబారి సమ్మారావు, గండ్ర జ్యోతి, బడే నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభ పార్టీ నేతలు, అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తల కన్నీటి నివాళితో ముగిసింది. కార్యక్రమంలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్దికి సంబంధించి 17 నిమిషాల నిడివితో ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరీ ప్రతి ఒక్కరినీ కదిలించింది. పెద్ది సతీమణి బోరున విలపించడంతో కేటీఆర్, హరీశ్‌రావు సైతం కన్నీరు పెట్టుకున్నారు. అంతేగాక తమ అధినేత ఇచ్చిన సందేశాన్ని విని పార్టీ నేతలు, అభిమానులు, నాయకులు, అన్ని వర్గాల ప్రజల హృదయాలు ద్రవించాయి.