న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన అంతరంగాన్ని వెలువరించాడు. అహ్మదాబాద్ వేదికగా తాజాగా ముగిసిన మెగాటోర్నీలో న్యూజిలాండ్‌ను చిత్తుచేసిన టీమ్ఇండియా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ట్రోఫీని నిలబెట్టుకుంది. వరుసగా రెండో సారి, ఓవరాల్‌గా మూడోసారి టైటిల్ ముద్దాడిన భారత జట్టు సంబురాల్లో మునిగిపోయింది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ప్లేయర్లు సత్తాచాటగా, సూర్యకుమార్ జట్టును ముందుండి నడిపించాడు. దేశానికి టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా నిలిచిన సూర్యకుమార్..సోమవారం పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక పాడ్‌కాస్ట్‌లో పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. టీ20ల్లో హాత్ సెట్ హో గయా అంటూ ముంబై హిందీ స్టయిల్లో చెప్పుకొచ్చిన సూర్య..టెస్టులు ఆడటం ఇష్టమైనా..వన్డేలు తన చాయిస్ కాదన్నాడు.
దాదాపు గంటపాటు సాగిన భేటీలో సూర్య తనదైన శైలిలో నవ్వుతో సమాధానాలు ఇచ్చాడు. ‘టీ20 ప్రపంచకప్ గెలువడం గొప్ప అనుభూతి. మరీ ముఖ్యంగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకోవడం మరిచిపోలేనిది. టీ20ల్లో పూర్తిగా సెట్ అయిపోయాను. జీవితంలో ఏది జరుగాలని రాసి ఉంటే అదే జరుగుతుంది. ఎర్ర బంతితో క్రికెట్ కెరీర్ మొదలుపెట్టాను. దాదాపు 10 నుంచి 12 ఏండ్ల పాటు రంజీ ట్రోఫీ ఆడాను. ముంబైలో పుట్టి పెరిగితే ఎర్ర బంతితో ఆడటం అలవాటు అయిపోతుంది అలా. కెరీర్ అంతా ఎర్ర బంతి చుట్టే తిరుగుతుంది. ఎప్పుడైతే తెల్ల బంతితో ఆడటం మొదలుపెట్టానో, అప్పటి నుంచి అటు వైపు తిరిగింది. అందుకే పొట్టి ఫార్మాట్ ఎంచుకున్నాను. వన్డేల్లోనూ మెరుగ్గా రాణించాను, కానీ అక్కడా ఏం జరుగలేదు. టీ20లు నాకు సరిగ్గా సరిపోయాయి, అందుకే నిలకడగా రాణిస్తున్నాను’ అని అన్నాడు.
సంప్రదాయక టెస్టులపై అమితమైన ప్రేమ ఉంది. ఇంతకుముందు చెప్పినట్లు 2010-11 నుంచి దాదాపు పదేండ్లు 2020 వరకు రెడ్‌బాల్ క్రికెట్ ఆడాను. పదేండ్లు చాలా సుదీర్ఘమైన సమయం, అందుకే ఆ ఫార్మాట్‌పై ప్రేమ పెంచుకున్నాను. ఆడాలన్న ఆకాంక్ష ఉన్నా.. 35 ఏండ్ల వయసులో మళ్లీ పునరాగమనం కష్టం అనిపిస్తుందన్నాడు. ఇదిలా ఉంటే తన అంతర్జాతీయ కెరీర్లో ఆస్ట్రేలియాతో 2023లో నాగ్‌పూర్‌లో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడిన సూర్యకుమార్ 8 పరుగులకే పరిమితమయ్యాడు.అప్పటి నుంచి తిరిగి మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించలేపోయాడు. అదే ఏడాది ఆసీస్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లోనూ ఈ డాషింగ్ బ్యాటర్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య 28 బంతుల్లో 18 పరుగులే చేశాడు. మూడు గంటల్లో ముగిసే టీ20 ఫార్మాట్ ఫ్యాన్స్‌కు ఎనలేని జోష్ అందిస్తున్న సూర్య..టెస్టులు సంప్రదాయక మజాను ఇస్తున్నాయని చెప్పుకొచ్చాడు.
తనకు వన్డేలు చాయిస్ కాదని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. ‘క్రమంగా ద్వైపాక్షిక సిరీస్‌లు తగ్గుతుండటమే వన్డేల ప్రభావం తగ్గుతుందని చెప్పొచ్చు. వన్డే క్రికెట్‌కు నాకున్న అనుభవంతో చూస్తే అది అనిపిస్తుంది. ఈ ఫార్మాట్లో మూడు వేర్వేరు పద్ధతుల్లో బ్యాటింగ్ చేసేందుకు అవకాశం లభిస్తుంది. వికెట్లు వెంటనే పడిపోతే ఇన్నింగ్స్ మొదట్లోనే బ్యాటింగ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు వికెట్ కోల్పోకుండా టెస్టు తరహాలో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మంచి స్ట్రైక్‌రేట్‌తో వన్డే తరహాలో ఆడాలి. ఆఖర్లో స్కోరు పెంచేందుకు టీ20 స్టయిల్లో దూకుడుగా బ్యాటింగ్ చేయాలి. అందుకే ఆ ఫార్మాట్‌ను ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయాను. మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నించాను, కానీ సాధ్యపడలేదు. వన్డేలు ఒక రకంగా చాలెంజింగ్ ఫార్మాట్’ అని సూర్య పేర్కొన్నాడు.
‘2023 వన్డే ప్రపంచకప్ సమయంలో జట్టు సభ్యుడిగా ఉన్న తాను ఆ ఫార్మాట్‌ను ఆస్వాదించాను. మెగాటోర్నీలో అపజయమెరుగని టీమ్ఇండియా అన్నింటి విజయాలు సాధిస్తూ ఫైనల్ చేరడం, ప్రతీ స్టేడియంలో ఫ్యాన్స్ మద్దతుగా నిలువడం మరిపోలేనిది. 2024, 2026 టీ20 ప్రపంచకప్ టోర్నీలతో పోలిస్తే చాలా వన్డే ఫార్మాట్ చాలా విభిన్నంగా అనిపించింది. వన్డేలకు ఒక రకమైన క్రేజ్ ఉంటే టీ20లకు మరోలా ఉంది’ అని సూర్య అన్నాడు.