కార్మికులు, సంఘాల వ్యతిరేకతను పెడచెవినపెట్టి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుండి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసింది. 2020లో కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కొత్తగా నాలుగు లేబర్ కోడ్లను రూపొందించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను రద్దు చేయడాన్ని, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తేవడాన్ని దేశవ్యాప్తంగా కార్మికులు, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
మోదీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు బలైన వాటిలో 37 రకాలైన భవన నిర్మాణ కార్మికులు ఎంతోకాలం నుంచి అనుభవిస్తున్న కార్మిక చట్టాలు సైతం ఉన్నాయి. విదేశీ స్వదేశీ కార్పొరేట్ సంస్థల బడా యాజమాన్యాలకు కట్టుబానిసలుగా కోట్లాది మంది అసంఘటిత కార్మికులు, సంఘటిత రంగంలోని కార్మికులు, జర్నలిస్టులు పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ నాలుగు లేబర్ కోడ్లను మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిందనేది నిర్వివాదాంశం.
నాలుగు లేబర్ కోడ్ల ద్వారా భవన నిర్మాణ కార్మికుల సెస్ నిర్వహణను ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ప్రైవేట్ సంస్థల అధిపతుల అజమాయిషీలో పెట్టేందుకు సామాజిక భద్రత కోడ్‌ను 2020లో రూపొందించారు. సెస్‌ను, నిధులను, బోర్డు నిధులను కార్మికుల కోసం వినియోగించకుండా ఇతర పథకాలకు మళ్లించే చర్యలను అరికట్టేందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తో ఆడిట్ చేయించాలని, కార్మిక సంక్షేమ పథకాలకు బోర్డు నిధులను ఖర్చు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జీఎస్టీని తెచ్చిన సమయంలో వివిధ రంగాల కార్మికులకు అమలులో ఉన్న సంక్షేమ పథకాలను కేంద్రం రద్దు చేసింది.
4 లేబర్ కోడ్లతో కార్మిక సంఘం ఏర్పాటు చేసుకొనే హక్కును లేకుండా చేస్తున్నది. మహిళలను రాత్రి వేళల్లో పనిచేయించేందుకు అవకాశం కల్పిస్తున్నది. భవన నిర్మాణ రంగంలో అత్యధికంగా మహిళలే ఉన్నందున వారి భద్రత మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి లాంటి కార్పొరేట్ సంస్థల అధిపతులు వారానికి 72 నుంచి 90 గంటలు అంటే రోజూ 12 నుండి 14 గంటల పాటు పనులు చేయాలని కార్మికులకు ఉపదేశాలిస్తున్నారు. ఆయా ప్రకటనల ప్రభావంతో భవన నిర్మాణ రంగంలో కార్మికుల పని గంటలు పెరిగే ప్రమాదం పొంచి ఉన్నది.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేట్ సంస్థల రక్షకులుగానే మోదీ ప్రభుత్వం పాలన సాగిస్తుంది. వారి సంపాదన పెంచేందుకు కోట్లాది మంది ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన సంస్థలను తెగనమ్మడానికి పూనుకున్నది. 2014 నుండి మోదీ విధానాలను గమనిస్తే ప్రభుత్వరంగ సంస్థలు, దేశ సంపదలు, వనరులు, ఖనిజాలు, అడవులు, భూములు, ఇన్సూరెన్స్, ఎయిర్‌పోర్టులు, రైల్వే, సముద్రాలు, రక్షణ రంగంతో సహా అన్నింటినీ బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే చర్యలను అమలు చేస్తూ వస్తున్నది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి తోడ్పడుతామని 2023లో ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ఎన్నికల హామీలో కాంగ్రెస్ పేర్కొన్నది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడగానే 2024 ఆగస్టు 21న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు, బోర్డు నిధులను అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు రహస్య టెండర్లను పిలిచింది. దీనికి వ్యతిరేకంగా భవన నిర్మాణ కార్మిక సంఘాలు, కార్మికులు ఐక్యంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ మిషన్ మోదీ పథకం సాకుతో అమలు చేస్తున్న కుటిల ప్రయత్నాలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమబోర్డు నిధులకు ప్రమాదకరంగా పరిణమించాయి. మోదీ ప్రభుత్వాన్ని అనుసరించే దిశగానే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నట్లు కనిపిస్తున్నది.
కార్మికులకు ప్రమాదకరంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను బీజేపీయేతర రాష్ర్టాలైన తమిళనాడు, కేరళ, బెంగాల్ తదితర రాష్ర్టాల్లో ఎట్టిపరిస్థితుల్లోనే అమలుచేసేది లేదని ప్రకటించాయి. కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ లేబర్ కోడ్ల వల్ల జరిగే నష్టంపై ఎందుకు నోరు విప్పడం లేదు? బీజేపీయేతర రాష్ర్టాలు ప్రకటించినట్లుగా తెలంగాణలోప్రకటించకపోవడం వెనుక బడే బాయ్ మోదీతో ఉన్న బలమైన బంధమా? లేక బీజేపీ విధానాల పట్ల అనుకూలతా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైఖరి అనుమానాలకు దారితీస్తున్నది.
మోదీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాల్లో భాగంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయబోమని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలి. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించాలి. నాలుగు లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రభుత్వంతో తీర్మానం చేయించే వరకు కోటి మంది భవన నిర్మాణ కార్మికులు, వారి కుటుంబాలు, మరో 50 లక్షల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబాలు ఉద్యమాన్ని సాగించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది.
వ్యాసకర్త: బీఓసీ రాష్ట్ర అధ్యక్షురాలు
జి.అనురాధ
99596 32366