Himalayan Lakes | న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల ప్రభావం హిమాలయ పర్వత ప్రాంతంలో తీవ్రంగా కనిపిస్తున్నది. ఇక్కడి మంచు నీటి సరస్సులు, ఇతర జలాశయాల విస్తీర్ణం 2011తో పోల్చితే 2024లో 10.81 శాతం పెరిగింది. దీంతో వరదలు వచ్చే ముప్పు తీవ్రమైందనే సంకేతాలు వస్తున్నాయి. ఉపరితల ప్రాంతం 33.7 శాతం పెరిగిందని, సరస్సులు మరింత ఎక్కువగా పెరిగాయని కేంద్ర జల కమిషన్ నివేదిక తెలిపింది.
మన దేశంలో 2011లో మొత్తం మంచునీటి సరస్సుల ఇన్వెంటరీ ఏరియా 1,962 హెక్టార్లు కాగా, 2024 సెప్టెంబరునాటికి ఇది 2,623 హెక్టార్లకు పెరిగినట్లు తెలిపింది. మన దేశంలో 67 సరస్సుల ఉపరితల విస్తీర్ణం 40 శాతానికిపైగా పెరిగింది. ఈ ప్రాం తాల్లో వరదలు సంభవించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ల లో మంచు నీటి సరస్సులు విస్తరిస్తుండటం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది వరద ముప్పునకు సంకేతం కాబట్టి, పర్యవేక్షణను పెంచాలి, విపత్తు నిర్వహణకు సంసి ద్ధం కావాలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.