చలో యూకే.. వ్యాక్సిన్ కోసం భారతీయుల క్యూ!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కోసం ఫైజర్-బయోఎన్‌టెక్ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్‌కు బుధవారం యునైటెడ్ కింగ్డమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలుసు కదా. ప్రపంచంలో ఓ వ్యాక్సిన్ విస్తృత స్థాయి వినియోగానికి అనుమతించిన తొలి దేశంగా యూకే నిలిచింది. అయితే ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే మన భారతీయుల్లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపించింది. చాలా మంది యూకే వెళ్లి.. వ్యాక్సిన్ వేసుకోడానికి రెడీ అయిపోతున్నారు. బుధవారమే కొందరు ట్రావెల్ ఏజెంట్లకు పెద్ద ఎత్తున ఫోన్లు రావడం విశేషం. యూకే టూర్ ప్యాకేజీ ఉందా? అక్కడ ఇండియన్స్‌కు వ్యాక్సిన్ వేస్తారా అని వాళ్లు ఆరా తీసినట్లు ఓ ట్రావెల్ ఏజెంట్ వెల్లడించారు. వచ్చే వారంలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుండటంతో.. సాధ్యమైనంత త్వరగా టీకా వేయించుకోవాలని చాలా మంది ఇండియన్స్ ఉబలాట పడుతున్నారు.
ఇప్పటికే బ్రిటన్ వీసా ఉన్నవాళ్లు ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్దామా అన్న ఆతృతలో ఉన్నారు. బ్రిటన్‌కు ఎప్పుడు, ఎలా వెళ్లాలి.. వ్యాక్సిన్ వేస్తారా అని చాలా మంది తమ ఆఫీస్‌కు ఫోన్లు చేసి అడిగినట్లు ముంబైకి చెందిన EaseMyTrip.com కోఫౌండర్, సీఈవో నిషాంత్ పిట్టి చెప్పారు. ఇప్పుడే వ్యాక్సిన్ గురించి ఏమీ చెప్పలేమని, అయినా ముందుగా కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వాళ్లకు వ్యాక్సిన్ వేస్తారని తాను వాళ్లకు చెప్పినట్లు నిషాంత్ తెలిపారు. నిజానికి ఈ సమయంలో లండన్‌కు వెళ్లే ఇండియన్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని, అయితే ఈ వ్యాక్సిన్ వార్తతో ఒక్కసారిగా యూకే టూర్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడిందని ఆయన చెప్పారు. తాము కూడా కేవలం వ్యాక్సినేషన్ కోసం వెళ్లే వారి కోసం మూడు రోజుల టూర్ ప్యాకేజీ ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
అయితే అక్కడి క్వారంటైన్ నిబంధనలపై యూకే ప్రభుత్వ ఆదేశాల గురించి తాము వేచి చూస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు అసలు ఇండియా నుంచి వచ్చిన వాళ్లకు వ్యాక్సిన్ వేస్తారా లేదా అన్నదానిపై కూడా ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. దీనిపైనే అక్కడి ఆసుపత్రులతోనూ తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు నిషాంత్ తెలిపారు. ఇప్పటికే ఎయిర్‌లైన్స్, హోటల్స్‌తో ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. అయితే డిసెంబర్ 15 నుంచి తమ దేశానికి వచ్చే వాళ్లు కనీసం ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండి.. ఆరో రోజు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలన్న నిబంధన విధించింది. ఒకవేళ నెగటివ్ రిపోర్ట్ వస్తేనే దేశంలోకి అనుమతిస్తారు.
తాజావార్తలు
- తెలంగాణ సూపర్
- ఈడబ్ల్యూఎస్ కోటాతో సమతూకం
- మేధోకు 2211 కోట్ల కాంట్రాక్టు
- 18 దేశాల్లో టిటా కమిటీలు
- టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్
- 25 నుంచి పీజీ ఈసెట్ స్పెషల్ కౌన్సెలింగ్
- ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- 24, 25న ఈఎస్సీఐ ఎంబీఏలో స్పాట్ అడ్మిషన్లు
- గిరిజనుల ఆర్థికాభివృద్ధే ఐటీడీఏ లక్ష్యం
- ఓయూ దూరవిద్య డిగ్రీ ఫలితాలు