శనివారం 06 జూన్ 2020
National - May 09, 2020 , 11:24:28

తండ్రి ఆస్తి కోసం మారుతల్లిపై కాల్పులు

తండ్రి ఆస్తి కోసం మారుతల్లిపై కాల్పులు

న్యూఢిల్లీ : తండ్రి ఆస్తి కోసం మారుతల్లి, ఆమె కుమారుడిపై కాల్పులు జరిపిన సంఘటన పంజాబ్‌లోని కదియాన్‌ గ్రామంలో మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కదియాన్‌ గ్రామానికి చెందిన హర్దీప్‌సింగ్‌(75) భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. ఆమె కుమారుడు గంగాదీప్‌ సింగ్‌. స్థానికంగా గంగాదీప్‌ భూస్వామి. అయితే భార్య చనిపోవడంతో.. హర్దీప్‌సింగ్‌ ఎవరికీ తెలియకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ మగ పిల్లాడు జన్మించాడు. 

లాక్‌డౌన్‌ కంటే ముందు మార్చి 20న హర్దీప్‌సింగ్‌.. రెండో భార్య నివాసానికి వెళ్లాడు. అంతలోనే లాక్‌డౌన్‌ అమలు కావడంతో.. హర్దీప్‌ అక్కడే ఉండిపోయాడు. ఈ సమయంలో హర్దీప్‌ అనారోగ్యానికి గురై గుండెపోటుతో మంగళవారం మృతి చెందాడు. మృతదేహాన్ని సదరు మహిళ.. హర్దీప్‌ సొంతూరికి తీసుకువచ్చింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

అంత్యక్రియలు చేసే కంటే ముందే ఆస్తి సమస్యలు వచ్చాయి. హర్దీప్‌ ఆస్తి తనకు కూడా దక్కాలని సదరు మహిళ కోరింది. హర్దీప్‌ తనను పెళ్లి చేసుకున్నాడని, తమకు ఓ కుమారుడు కూడా జన్మించాడని చెప్పింది. దీంతో ఆగ్రహాంతో ఊగిపోయిన గంగాదీప్‌ సింగ్‌.. మారుతల్లితో పాటు ఆమె కుమారుడిపై కాల్పులు జరిపి పరారీ అయ్యాడు. తల్లీకుమారుడిల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంగాదీప్‌తో పాటు ఆయన కుమారుడు నెక్‌వీర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే హర్దీప్‌తో సదరు మహిలకు పెళ్లి అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. 


logo