తిరువనంతపురం: మట్టిచరియలు విరిగిపడే ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. మరికొందరితోపాటు ఇళ్లను వీడి శిబిరానికి చేరుకున్నాడు. అయితే రాత్రి వేళ భార్యతో కలిసి ఇంటికి తిరిగి వెళ్లాడు. మట్టిచరియలు విరిగిపడటంతో అతడు మరణించాడు. (Man Killed In Mudslide) కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదిమలిలోని మన్నంకండంలో జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ హైవే కింద ఉన్న కొండ వాలులో ఒక నివాస కాలనీ ఉన్నది. తవ్వకాల వల్ల మట్టిచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో శనివారం సాయంత్రం 22 కుటుంబాలను ఆదిమలిలోని స్కూల్లో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు.
కాగా, 48 ఏళ్ల బీజు కూడా తన ఇంటిని వీడి భార్య సంధ్యతో కలిసి ఆ శిబిరానికి వెళ్లాడు. అయితే అతడు భార్యతో కలిసి రాత్రి వేళ ఇంటికి తిరిగి వచ్చాడు. వారు ఆహారం వండుకున్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో మట్టిచరియలు విరిగిపడ్డాయి. దీంతో బీజు ఇంటితో పాటు మరో ఎనిమిది ఇళ్లులు ధ్వంసమయ్యాయి.
మరోవైపు ఇది తెలుసుకున్న స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఇంటి శిథిలాల కింద చిక్కుకున్న బీజు, అతడి భార్య సంధ్యను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేట్టారు. ఐదు గంటలు శ్రమించిన తర్వాత వారిని బయటకు తీశారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బీజు మరణించాడు. అతడి భార్యను అలువాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, రహదారి విస్తరణ కోసం ఎలాంటి భద్రతా జాగ్రత్తలు లేకుండా మట్టిని తొలగిస్తున్నారని బాధిత కుటుంబంతోపాటు ఇండ్లు ధ్వంసమైన స్థానికులు ఆరోపించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కొండ వాలును తొలగిస్తున్నారని విమర్శించారు. ఇండ్లు కోల్పోయిన తమకు ప్రభుత్వం పునరావాస చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
Also Read:
Bengaluru Potholes | బెంగళూరులోని రోడ్లపై గుంతలకు.. మరో మహిళ బలి
Watch: బైక్ స్టంట్లో బీటెక్ విద్యార్థి మృతి.. స్కిడ్ కావడంతో ఎగసిన నిప్పురవ్వలు
Watch: స్కూల్ యూనిఫాంలో అమ్మాయిలు.. లిక్కర్ షాపులో మద్యం కొనుగోలు