Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉగాది కానుకగా థియేటర్లలోకి వచ్చి సందడి చేస్తోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ హిట్ కాంబో మళ్లీ కలిసి రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలైన వెంటనే మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, పవన్ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ మూవీ బాగా అలరిస్తోందని టాక్ వినిపిస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో ఉగాది పచ్చడిలా అన్ని రకాల భావోద్వేగాలను మిక్స్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించారు. అయితే అందులో కొన్ని అంశాలే బాగా కనెక్ట్ అయ్యాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్, ఆయన ట్రేడ్‌మార్క్ స్వాగ్, ఫైట్స్, డ్యాన్స్‌లు అభిమానులకు ఫుల్ ట్రీట్‌గా మారాయి.
ఇక ఈ సినిమాలో స్పెషల్ హైలైట్‌గా నిలిచింది రిఫరెన్స్‌ల ట్రెండ్. పాత హిట్ పాటలను రీమిక్స్ చేసి వినిపించడం టాలీవుడ్లో ఇటీవల పెరిగిన ట్రెండ్ కాగా, ఈ సినిమాలో కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యారు. పవన్ నటించిన తొలి ప్రేమ లోని ‘ఈ మనసే’ పాటను రీమిక్స్ చేసి వినిపించగా థియేటర్లలో మంచి స్పందన లభిస్తోంది. అంతేకాకుండా RRR లోని ‘నాటు నాటు’, ఇంద్ర లోని ‘రాధే గోవిందా’, గుంటూరు కారం లోని ‘కుర్చీ మడతపెట్టి’, అలాగే గ్యాంగ్ లీడర్ లోని ‘వానా వానా వెల్లువాయే’ వంటి పాటలను సందర్భానుసారం ఉపయోగించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేకంగా మహేష్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ రిఫరెన్స్‌ను ఈ సినిమాలో చూపించడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా స్టార్ హీరోల మధ్య పోటీ ఉన్నప్పటికీ, ఇలాంటి రిఫరెన్స్‌లను ఉపయోగించడం సినీ ప్రేమికులకు సర్ప్రైజ్గా మారింది.
‘కుర్చీ మడతపెట్టి’ స్టెప్పులతో పవన్ కళ్యాణ్ చేసిన డ్యాన్స్ థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకుంటోంది.చ మొత్తానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కథ, కథనం పరంగా మిక్స్డ్ టాక్ వచ్చినా, ఫ్యాన్స్‌కు మాత్రం ఇది ఫుల్ మీల్స్ ఎంటర్టైనర్గా నిలుస్తోంది. ముఖ్యంగా రిఫరెన్స్‌లు, మాస్ ఎలిమెంట్స్, పవన్ స్వాగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.