సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : బండ్లగూడలో ఓ కానిస్టేబుల్ డబ్బులు లెక్కించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దర్యాప్తునకు ఆదేశించిన రవాణా శాఖ కమిషనర్ సోమవారం ఆ కార్యాలయ ఆర్టీవో రాంచందర్ నాయక్, ఎంవీఐ భీమ్‌సింగ్, డబ్బులు లెక్కించిన కానిస్టేబుల్ అరుణ్‌ను సస్పెండ్ చేశారు. ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల ప్రమేయంపై ఆర్టీవోలే బాధ్యత తీసుకోవాలని గతంలో రవాణా శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కానిస్టేబుల్ అరుణ్ చేసిన నిర్వాకానికి ఆర్టీవో, ఎంవీఐపై వేటు పడింది. వారిని రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.
బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయం అంటేనే అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందనే ఆరోపణలున్నాయి. ప్రతీ పనికో రేటు నిర్ణయించి వసూళ్ల పర్వం కొనసాగించడంలో ఆ కార్యాలయ సిబ్బంది పనితీరు ప్రత్యేకం. ఎల్ఎల్ఆర్, ఎన్వోసీ, పర్మిట్స్, ట్యాక్స్, వాహన యాజమాన్య హక్కుల బదిలీ తదితర పనులకు వంకలు పెట్టి మరీ వసూళ్లు చేస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళారులతో కలిసి కొంతమంది సిబ్బంది వాహనదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్టు తెలిసింది. అయితే ఈ కార్యాలయంలో ఏ ఆర్టీవో విధులు నిర్వర్తించినా కిందిస్థాయి సిబ్బందిని నిలువరించలేకపోతున్నారు. నివారణ చర్యలు తీసుకోవడానికి ఆర్టీవో ప్రయత్నిస్తే సంఘాలు, కొందరి రాజకీయ నాయకుల పేర్లతో బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ఏడాది పాటు ఆర్టీవో లేకుండానే బండ్లగూడ కార్యాలయంలో కార్యకలాపాలు సాగాయి. ఇన్చార్జి ఆర్టీవోతో పర్యవేక్షించినా ఫలితం లేదు. ఈ క్రమంలో ఇటీవల ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయిన ఆర్టీవో రాంచందర్‌ను బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయ ఆర్టీవోగా నియమించారు. నెల రోజుల్లోనే అక్కడి సిబ్బంది దళారులతో చేస్తున్న వ్యవహారంపై ప్రశ్నించి పారదర్శక సేవలకు శ్రీకారం చుట్టారు. ఇది మింగుడు పడని దళారులు, కొంతమంది అధికారులు సదరు ఆర్టీవోపై ఎలాగైన చర్యలు తీసుకునేలా ముమ్మర ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో అనూహ్యంగా కానిస్టేబుల్ డబ్బులు లెక్కించిన వీడియో బయటకు రావడంతో ఆ కారణాన్ని చూపుతూ ఆర్టీవో రాంచందర్‌పై వేటు పడాల్సి వచ్చింది. ఆర్టీవో సస్పెన్షన్‌పై కొందరు ఆర్టీవోలు, ఎంవీఐలు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. కానిస్టేబుల్ చేసిన తప్పిదానికి కొత్తగా వచ్చిన ఆర్టీవోను సస్పెండ్ చేయడం ఏంటని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దళారులు ఆర్టీఏ కార్యాలయాల్లోకి ప్రవేశించగానే సీసీ కెమెరా పట్టేస్తుందని, అత్యాధునిక కెమెరాలు ప్రతీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తామని ఉన్నతాధికారులు గతంలో డాంబికాలు పలికారు. బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయంలో నిత్యం అవినీతి కార్యకలాపాలు సాగుతాయని వాహనదారులు చెబుతున్నారు. దీంతో ఎలాంటి భయం లేకుండా కానిస్టేబుల్ కార్యాలయంలోనే డబ్బులు లెక్కించే సాహసం చేశాడు. కాగా, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో రెండు నెలల కిందటిదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏమైనట్టో అక్కడి సిబ్బందికే తెలియాలి. ఆ కార్యాలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవడం ఏంటని వాహనదారులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా బండ్లగూడలో సీసీ కెమెరాల ఏర్పాటు, దళారుల ఎంట్రీని నిలువరించే చర్యలు తీసుకోకపోతే అవినీతి ఆగదని వాహనదారులు పేర్కొంటున్నారు. కొత్తగా వచ్చే ఆర్టీవోలే బలికావాల్సి వస్తుందని చెబుతున్నారు.