Kerala polls : నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) నగారా మోగించింది. అప్పటి నుంచి ఆ నాలుగు రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాంలలో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికల కోలాహలం నెలకొన్నది. అభ్యర్థుల ఎంపిక, జాబితాల విడుదల, నామినేషన్లతో పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. ఇవాళ కేరళ (Kerala) లోని ధర్మదం (Dharmadam) నియోజకవర్గం నుంచి సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) నామినేషన్ (Nomination) దాఖలు చేశారు.
ఏప్రిల్ 9న కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో అక్కడి నామినేషన్ల పర్వం మొదలైంది. అందులో భాగంగానే విజయన్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11 గంటల సమయంలో తలస్సెరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు బుధవారం తన నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. 80 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ప్రచారం మొదలుపెట్టిన విజయన్ తన రాజకీయ జీవితంలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయడం ఇది ఏడోసారి.
ధర్మదం నుంచి బరిలో దిగడం ఇది మూడోసారి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున వీపీ అబ్దుల్ రషీద్ బరిలో నిలువగా.. బీజేపీ అభ్యర్థిగా రంజిత్ పోటీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 9న 140 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది.