పాట్నా: ఒక వ్యక్తి మూడేళ్లలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. వరకట్న వేధింపులు, గృహహింసపై మొదటి, రెండో భార్యలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే మూడో భార్యతో కలిసి ఉంటున్న అతడు మొదటి, రెండో భార్యలపై పలు ఆరోపణలు చేశాడు. (Man Married 3 Times) బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పింటు బర్న్వాల్ అనే వ్యక్తి మూడేళ్లలో ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. 2022 డిసెంబర్ 2న ఖుష్బూ కుమారితో తొలి వివాహం జరిగింది. వరకట్నం కోసం వేధింపులు, గృహహింస ఆరోపణలతో పెళ్లైన కొన్ని రోజులకే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
కాగా, 2024 ఏప్రిల్ 18న గుడియా కుమారిని పింటూ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఒక సంతానం తర్వాత అతడు తనను మోసగించి వదిలేసినట్లు ఆమె ఆరోపించింది. గ్రామస్తుల ద్వారా పింటూ తొలి పెళ్లి గురించి తెలిసినట్లు గుడియా తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ అయిన అతడు ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యాడని పేర్కొంది.
మరోవైపు పింటూ ఈ ఏడాది మరో మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా ఒక సంతానం కలిగింది. అయితే మొదటి, రెండో భార్యలకు విడాకులు ఇవ్వకుండానే అతడు మూడో పెళ్లి చేసుకున్న విషయం వారికి తెలిసింది. ఈ నేపథ్యంలో ఖుష్బూ, గుడియా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్నం కోసం వేధించడంతోపాటు తమను శారీరకంగా హింసించాడని ఆరోపించారు.
కాగా, మొదటి, రెండో భార్యల ఆరోపణలను పింటూ ఖండించాడు. తన కుటుంబ పరిస్థితి వల్లనే మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. మొదటి భార్య ఖుష్బూ పదేళ్లు పెద్దదని, తనతో పాటు తన తల్లిని కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించిందని ఆరోపించాడు. ‘నా తల్లికి 60 సంవత్సరాలు. వారిద్దరూ రెండు రోజులైనా ఆహారం వండలేదు. బదులుగా నా తల్లి, నేను వారికి వండిపెట్టాము’ అని వాపోయాడు. తన మూడో భార్య ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదని తమను బాగా చూసుకుంటున్నదని తెలిపాడు.
అయితే మొదటి భార్య ఖుష్బూ కుమారి, రెండో భార్య గుడియా కుమారి ఫిర్యాదులపై పోలీసులు స్పందించారు. పింటూను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ విధించడంతో అతడ్ని జైలుకు తరలించారు.
Also Read:
Two Sisters Die By Suicide | అనారోగ్యంతో పెంపుడు కుక్క.. మనస్తాపంతో అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య
Train Hits Bike | బైక్ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు మృతి