Mamata Banerjee | ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ (Niti Aayog) సమావేశం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ప్రారంభమైన 9వ పాలక మండలి భేటీలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఒక్కరే ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే, ఈ సమావేశంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు.
ఈ సమావేశంలో బెంగాల్‌కు కేంద్ర నిధులు నిరాకరించిన అంశాన్ని ప్రస్తావించగా.. తన మైక్‌ను మ్యూట్ (mic was muted) చేసినట్లు దీదీ ఆరోపించారు. ఐదు నిమిషాలకు మించి మాట్లాడేందుకు అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే భేటీ నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. ‘నాకు ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడేందుకు అనుమతించారు. పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని సమావేశంలో ప్రస్తావించాను. అంతే నామైక్ను మ్యూట్ చేసేశారు. నాకంటే ముందు చాలా మంది మాట్లాడారు. వారికి 20 నిమిషాలు సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఇచ్చారు. నాకు మాత్రం 5 నిమిషాలు మాత్రమే మాట్లాడేందుకు అనుమతించారు. ఇందుకు నిరసనగా నేను సమావేశం నుంచి బయటకు వచ్చేశాను. విపక్షాల నుంచి నేను ఒక్కదాన్నే ఈ సమావేశంలో పాల్గొన్నప్పటికీ నన్ను మాట్లాడనివ్వకపోవడం అవమానకరం’ అని సమావేశం నుంచి బయటకు వచ్చిన అనంతరం దీదీ విలేకరులతో అన్నారు.
విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు గైర్హాజరు
ఇక ఈ భేటీని విపక్ష పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు బాయ్‌కాట్ చేశారు (Opposition chief ministers skip). ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై వివక్ష చూపిందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా దక్షిణాది రాష్ర్టాలపై మోదీ సర్కార్ నిర్లక్ష్యం వహించిందని ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపుల తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని పలువురు సీఎంలు బహిష్కరించారు. వీరిలో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ సీఎంలు ఎంకే స్టాలిన్, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, భగవంత్ మాన్, సుఖ్విందర్ సింగ్ సుఖు ఉన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కూడా భేటీకి గైర్హాజరయ్యే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తాను నీతి ఆయోగ్ భేటీకి హాజరు కాలేనని కేరళ సీఎం విజయన్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు.
Also Read..
NITI Aayog | ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ ప్రారంభం.. పలు రాష్ట్రాల సీఎంలు గైర్హాజరు
Tihar Jail | తీహార్ జైలులో గొడవ.. ఇద్దరు ఖైదీలకు గాయాలు
Encounter | జమ్మూ కశ్మీర్లో మరోసారి ఎదురుకాల్పులు.. జవాను మృతి..!