Mamata Banerjee | ఎనిమిది రోజుల మిషన్ కోసం అని వెళ్లి దాదాపు తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), బచ్ విల్మోర్ సురక్షితంగా భూమికి చేరుకున్న విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం బుధవారం వేకువజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్రజలాల్లో దిగారు. సుదీర్ఘ విరామం తర్వాత వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా వ్యోమగాములను అభినందిస్తున్నారు.
ఈ క్రమంలో సునీత రాకపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు, సునీతా విలియమ్స్‌కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న (Bharat Ratna ) అవార్డును ప్రదానం చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో దీదీ మాట్లాడుతూ.. ‘సునీతా విలియమ్స్‌కు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారు చాలా బాధలను భరించారు. వ్యోమగాములను సురక్షితంగా భూమికి చేర్చేందుకు కృషి చేసిన రెస్క్యూ బృందానికి కూడా ధన్యవాదాలు. గతంలో కల్పనా చావ్లా కూడా అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది. కానీ తిరిగి రాలేకపోయింది. సునీతా విలియమ్స్ వెళ్లిన అంతరిక్ష నౌకలో కూడా ఏదో లోపం ఉందని నేను విన్నాను. కల్పనా చావ్లా కూడా అదే సమస్యను ఎదుర్కొన్నారు. అందుకే సునీతా విలియమ్స్, మరో ముగ్గురు వ్యోమగాములు చాలా నెలలుగా అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. సునీతా విలియమ్స్ భారత్ చెందిన వ్యక్తి. ఆమెకు భారతరత్న ఇవ్వాలని నేను కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాను’ అని దీదీ అన్నారు.
Also Read..