Sunita Williams | న్యూయార్క్ : సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 286 రోజులుగా చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ సురక్షితంగా భూమికి చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం వేకువజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్రజలాల్లో దిగారు. వారితోపాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గొర్బునోవ్ కూడా భూమికి తిరిగొచ్చారు.
సుదీర్ఘ కాలం పాటు జీరో గ్రావిటీలో గడిపిన వ్యోమగాములు భూమిపై ఉండే గురుత్వాకర్షణకు అలవాటు పడటం అంత సులువు కాదు. జీరో గ్రావిటీ వాతావరణంలో శరీరంలోని రక్తం సహా ద్రవాలన్నీ కింది భాగం నుంచి పైకి చేరుకుంటాయి. ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. దీంతో భూమిపైకి చేరుకున్నాక వారు నిలబడేందుకు కూడా తీవ్రంగా ఇబ్బండి పడతారు. కనీసం పెన్సిల్‌ను కూడా ఎత్తలేని పరిస్థితి ఏర్పడుతుంది. తల తిరగడం, వికారం తదితర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వ్యోమగాములు తిరిగి రాగానే వారిని మొదట కుర్చీలో కూర్చోబెడతారు. ఆ తర్వాత వారిని రీహాబిటేషన్ సెంటర్లో కొంతకాలం పాటు ఉంచుతారు. ఇప్పుడు సునీతా సహా ఇతర వ్యోమగాములను 45 రోజుల పాటు నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్లో రీహాబిటేషన్‌లో ఉంచనున్నట్టు తెలుస్తున్నది. ఇది మూడు దశల్లో సాగనున్నది. ఒక రోజుకు రెండు గంటల పాటు ఇది జరగనున్నది. 45 రోజుల సాధారణ సమయం. అయితే, కొన్ని పరిస్థితుల్లో ఇది నెలల పాటు కొనసాగే అవకాశం ఉన్నది. పూర్తిగా కోలుకునేందుకు కొంతమందికి సంవత్సరం కూడా పట్టవచ్చు. మొదటి దశలో భాగంగా నడిచేందుకు వీలుగా బలం, సామర్థ్యాన్ని తిరిగి పొందేందుకు వర్కవుట్ చేస్తారు. రెండో దశలో భాగంగా శరీరం తన సామర్థ్యాన్ని తిరిగి పొందేందుకు, మెదడు పనితీరు మెరుగుపరిచే ప్రక్రియలు ఉంటాయి. మూడో దశలో శారీరక ఫెర్మార్మెన్స్ బెస్ట్ లెవల్‌ను తిరిగి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు.
2024 జూన్ 5న బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో 8 రోజుల అంతరిక్ష యాత్రలో భాగంగా సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ఐఎస్ఎస్కు చేరుకున్నారు. అయితే, అంతరిక్షానికి చేరుకునే క్రమంలోనే స్టార్‌లైనర్ ‘కాలిప్సో’లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. హీలియం లీకేజీ, థ్రస్టర్స్ ఓవర్‌హీటింగ్ తదితర కారణాల వల్ల వారు అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది. కాలిప్సోలో సమస్యల నేపథ్యంలో వారిని అందులో భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని, నాసా భావించింది.
భూమిపైకి సురక్షితంగా తిరిగొచ్చిన నాసా వ్యోమగాములను వైట్‌హౌస్‌కు ఎందుకు పిలవలేదన్న దానిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టత ఇచ్చారు. ‘అంతరిక్షం నుంచి తిరిగొచ్చాక ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడటం అంత సులువు కాదు. రీహాబిటేషన్ సెంటర్లో ఉండాల్సి వస్తుంది. అందుకే వారిని పిలవలేదు. ఇంకా చాలా సమయం ఉంది. వారు కోలుకున్నాక పిలుస్తా’ అని తెలిపారు.
వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకోవడాన్ని స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్వాగతించారు. ‘మరోసారి వ్యోమగాములను సురక్షితంగా భూమికి చేర్చిన స్పేస్ ఎక్స్, నాసాకు అభినందనలు. ఈ మిషన్‌కు ప్రాధాన్యం ఇచ్చిన ట్రంప్‌కు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు. మరోవైపు ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ… వ్యోమగాములను తిరిగి తీసుకొచ్చే విషయమై మాజీ అధ్యక్షుడు బైడెన్‌తో మాట్లాడానని, కానీ రాజకీయ కారణాలతో ఆయన తమ ఆఫర్‌ను తిరస్కరించారని ఆరోపించారు.
ఐఎస్ఎస్కు అవసరమైన మరమ్మతులు చేశారు. అంతరిక్ష వ్యవసాయం, అంతరిక్షంలో ఆరోగ్యం తదితర 150కి పైగా ప్రయోగాలు నిర్వహించారు. ఐఎస్ఎస్ భాగాలపై సూక్ష్మజీవులు వృద్ధి చెందుతున్నాయోమోననే విషయమై నమూనాలు సేకరించి, ప్రయోగాలు జరిపారు.
సునీత భూమికి సురక్షితంగా తిరిగి రావడంతో భారతీయులు సంబురాలు చేసుకున్నారు. సునీత పూర్వీకుల గ్రామమైన గుజరాత్‌లోని ఝూలాసన్తో పాటు పలు ప్రాంతాల్లో సంతోషాలు మిన్నంటాయి.
అంతరిక్షంలోని పరిస్థితులకు అనుగుణంగా వ్యోమగాముల కోసం ప్రత్యేకంగా కొన్ని ఆహార పదార్థాలను నాసా తయారు చేస్తుంది. వీటిని ప్రతి మూడు నెలలకోసారి అక్కడి పంపిస్తారు. ఈ ఆహారం ఎక్కువగా ద్రవ రూపంలోనే ఉంటుంది. తాజా పదార్థాలు తినే ఆసార్కం ఉండదు. శీతల పానీయాలను వ్యోమగాములు వేడి చేసి తీసుకుంటారు. తగినన్నీ క్యాలరీలు ఉండేందుకు పొడి రూపంలో పాలు, చికెన్, ట్యూనా తదితర పదార్థాలను వ్యోమగాములు తీసుకుంటారు.
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో 1965 సెప్టెంబర్ 19న జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఝూలాసాన్కు చెందినవారు. ఆయన అమెరికాకు వలస వెళ్లారు. స్లోవేకియాకు చెందిన బోని పాండ్యాను దీపక్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో సునీతా చిన్నవారు. సునీత 1983లో నదీమ్ హైస్కూల్లో గ్రాడ్యుయేట్ పూర్తిచేశారు. 1987లో యూఎస్ నావల్ అకాడమీ నుంచి బీఎస్సీ డిగ్రీని పొందారు. 1987లో ఆమె నావల్ కెరీర్ ప్రారంభమైంది. ఈ అకాడమీలో ఉండగా.. తన సహచరుడైన మైకేల్ జే విలియమ్స్‌ను 1989లో పెండ్లి చేసుకున్నారు. 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. అనంతరం ఆమె వ్యోమగామి కెరీర్ మొదలైంది. ఆమె అనేక స్పేస్ మిషన్లను సమర్థంగా నిర్వహించారు.