SpaceX Dragon Capsule | ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బారీ విల్మోర్ ఎట్టకేలకు భూమిపైకి తిరిగి వచ్చారు. స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ మంగళవారం ఐదుగురు వ్యోమగాములను భూమికి తీసుకువచ్చింది. ఐఎస్ఎస్ నుంచి విడిపోయిన డ్రాగన్ క్యాప్సుల్ దాదాపు 17 గంటల పాటు ప్రయాణించి.. ఫ్లోరిడాలోని సముద్రంలో దిగింది. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ డ్రాగన్ క్రూ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో ముఖంలో ఆనందం కనిపించింది. నాసా సిబ్బంది డ్రాగన్ క్రూలో నుంచి వ్యోమగాములను బయటకు తీసి పడవలో తీసుకెళ్లారు.
సునీత విలియమ్స్, బారీ విల్మోర్ కేవలం ఎనిమిది రోజుల మిషన్ కోసం ఐఎస్ఎస్కు వెళ్లారు. కానీ బోయింగ్ స్టార్‌లైన్ స్పేస్‌షిప్‌లో సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఇద్దరూ తొమ్మిది నెలలు ఐఎస్ఎస్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే, ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాపూల్ ధర ఎంత ? సునీత విలియమ్స్ తిరిగి వచ్చిన డ్రాగన్ క్రూలో ఒక్క సీటుకు ఎంత చార్జి వసూలు చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లో ఏడుగురు వ్యోమగాములు ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఒక్కో సీటు ధర 55 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.476కోట్లు. దీన్ని బట్టి ఎలాన్ మస్క్ కంపెనీ ఎంత సంపాదిస్తుందో అర్థం చేసుకోవచ్చు. కానీ, ఈ ధరను కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ కింద స్పేస్ఎక్స్, నాసా మధ్య ఒప్పందం కుదుర్చుకుంది. నాసా 2014లో కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ కింద స్పేస్ ఎక్స్‌కు 2.6 బిలియన్ డాలర్లకు ఒప్పందం చేసుకుంది.
ఒక మిషన్ ఖర్చు సగటు 400 మిలియన్ డాలర్లు. ప్రస్తుతం ఈ ఖర్చు భారీగా తగ్గింది. స్పేస్ఎక్స్ రాకెట్ సాంకేతికను మెరుగుపరిచింది. 2019లో నాసా ఇన్స్పెక్టర్ జనరల్ నివేదిక.. ఒక్కో సీటుకు రూ.476కోట్ల ఖర్చుగా పేర్కొంది. అయితే, స్పేస్‌క్స్ చాలా తక్కువగానే చార్జీని వసూలు చేస్తున్నది. బోయింగ్ స్టార్‌లైనర్ ఒక్కో సీటుకు 90 మిలియన్స్ వసూలు చేయనుంది. ఇదిలా ఉండగా.. స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌ని నిర్మించినప్పటి నుంచి ఇప్పటికీ 46 సార్లు ప్రయోగించారు. డ్రాగన్ క్రూ క్యాప్సూల్ ఐఎస్ఎస్కు 42 సార్లు ప్రయాణంచింది. క్రూలో ఏడుగురు ఆస్ట్రోనాట్స్ సీట్లు ఉంటాయి. ప్రపంచంలోనే ఇది తొలి ప్రైవేటు స్పేస్ ఫ్లైట్. వ్యోమగాములతో పాటు సరుకును ఐఎస్ఎస్కు తీసుకెళ్తుంది. సాధారణంగా ఇద్దరు నుంచి నలుగురు వ్యోమగాములు ప్రయాణిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఏడుగురు ప్రయాణించొచ్చు.