Mallikarjun Kharge : పదేండ్లలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన ఖర్గే బుధవారం శ్రీనగర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత పదేండ్లలో బీజేపీ చేసింది శూన్యమని, ఎక్కడైనా బ్రిడ్జిని ప్రారంభిస్తే అది కుప్పకూలుతోందని, అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభిస్తే ఆలయం నుంచి నీరు కారుతోందని వ్యాఖ్యానించారు.
ప్రతిచోటా మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని, పవిత్ర హస్తంతో ప్రారంభోత్సవం చేయాలని ప్రజలు అంటున్నారు, ఇప్పుడు అది పవిత్ర హస్తమో, మరే హస్తమో నాకు తెలియడం లేదని అన్నారు. ఇక అనంత్‌నాగ్‌లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అంతకుముందు ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఇవాళ దేశంలో మైనారిటీ ప్రభుత్వం కొలువుతీరిందని, లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ 400కుపైగా స్ధానాలు గెలుచుకుంటామని ప్రగల్బాలు పలికిందని గుర్తుచేశారు.
మరి మీ 400 సీట్లు ఎక్కడున్నాయని ఎద్దేవా చేశారు. 400పైగా సీట్లు సాధిస్తామని డప్పు కొట్టుకున్న కాషాయ పార్టీకి అతికష్టం మీద 240 స్ధానాలే దక్కాయని వ్యాఖ్యానించారు. తమకు మరో 20 సీట్లు వచ్చిఉంటే ఈ నేతలంతా జైల్లో మగ్గేవారని, వారికి అదే సరైన ప్రదేశమని ఖర్గే పేర్కొన్నారు. అందుకు వారు అర్హులని పరోక్షంగా కాషాయ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అసమర్ధ కూటమిగా మారిందని అన్నారు.
Read More :
Actor jeeva | హీరో జీవాకు తప్పిన పెను ప్రమాదం