Dharmasthala : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల (Dharmasthala) సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును చేధించడం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) జరుపుతున్న తవ్వకాల్లో పురుషుడి అస్థిపంజరం (Male Skeleton) తోపాటు పలు మానవ ఎముకలు లభ్యమయ్యాయని కర్ణాటక హోంశాఖ మంత్రి (Karnataka Home Minister) జీ పరమేశ్వర (G Parameshwara) తొలిసారి అధికారికంగా ధృవీకరించారు.
ఇవాళ (గురువారం) బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన హోంమంత్రి పరమేశ్వర.. కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఒక వ్యక్తి తాను 13 ప్రదేశాల్లో మృతదేహాలను పాతిపెట్టినట్లు ఫిర్యాదు చేశాడు. అతని వాంగ్మూలం ఆధారంగా సిట్ బృందాలు ఆయా ప్రదేశాల్లో తవ్వకాలు చేపట్టాయి. ఆరో ప్రదేశంలో ఒక పురుషుడి అస్థిపంజరం దొరికింది. మరో కొత్త ప్రదేశంలోనూ కొన్ని ఎముకలు లభ్యమయ్యాయి. లభ్యమైన అన్ని అవశేషాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) కి పంపాం’ అని చెప్పారు. 13వ స్థానంలో మాత్రం ఇంకా ఏమీ దొరకలేదన్నారు.
మెజిస్ట్రేట్ ముందు ఫిర్యాదుదారు సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇస్తూ.. తాను వందల సంఖ్యలో మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు చెప్పడంతో ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి సిట్ ఏర్పాటు చేసిందని పరమేశ్వర తెలిపారు. దర్యాప్తులో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని, శాస్త్రీయంగా, సాంకేతిక పరిజ్ఞానంతో నిజానిజాలు నిగ్గు తేల్చాలని సిట్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ఆయన చెప్పారు.