Sonia Gandhi | దేశ ప్రజలు కాంగ్రెస్ (Congress) పట్ల సానుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) అన్నారు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ అతి విశ్వాసం పనికిరాదని పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో (Congress Parliamentary Party meeting) సోనియా ఈ విధంగా వ్యాఖ్యానించారు. రానున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమాయాత్తం కావాలని ఈ సందర్భంగా నేతలకు సూచించారు.
‘రానున్న కొన్ని నెలల్లో నాలుగు రాష్ట్రాల (మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పరిస్థితులు మనకు అనుకూలంగానే ఉన్నాయి. అయినా, మనం ఆత్మసంతృప్తి చెందకూడదు. అతిగా ఆత్మ విశ్వాసంతో ఉండకూడదు. కష్టపడి పనిచేస్తే ఫలితాలు మనకు అనుకూలంగా వస్తాయి. లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగిస్తూ.. మంచి పనితీరును కనబరిచినట్లైతే జాతీయ రాజకీయాల్లో మార్పులు తీసుకురాగలం. నేతలంతా కలసికట్టుగా పనిచేయాలి’ అని సోనియా పార్టీ నేతలకు సూచించారు.
ఈ సమావేశంలో మణిపూర్, జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడి ఘటనలు, కన్వరీ యాత్ర, బడ్జెట్ కేటాయింపులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విభజన రాజకీయాలను ప్రజలు తిరస్కరించినా మోదీ ప్రభుత్వంలో ఎలాంటి మార్పూ రాలేదని ఈ సందర్భంగా సోనియా వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎదురుదెబ్బ తర్వాత మోదీ సర్కార్ పాఠాలు నేర్చుకుంటుందని అనుకున్నామన్నారు. కానీ ఇప్పటికీ వారు సమాజాన్ని వర్గాలవారీగా విభజించి భయం, శత్రుత్వ వాతావరణాన్ని వ్యాప్తి చేసే విధానానికి కట్టుబడి ఉన్నారని విమర్శించారు.
అదేవిధంగా కాన్వరీ యాత్రపై కూడా సోనియా స్పందించారు. ఈ యాత్రపై సరైన సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కూడా సోనియా స్పందించారు. ఈ బడ్జెట్లో రైతులు, యువత డిమాండ్లను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. కీలకమైన అనేక రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు లేవని అన్నారు.
జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడుల ఘటనను కూడా సోనియా ప్రస్తావించారు. కొన్ని వారాలుగా ఒక్క జమ్మూ ప్రాంతంలోనే కనీసం 11 ఉగ్రదాడులు జరిగాయన్నారు. ఈ దాడుల్లో ఎంతో మంది భద్రతా సిబ్బంది, పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ ఘటనలు జమ్మూ కశ్మీర్లో అన్నీ బాగానే ఉన్నాయని మోదీ ప్రభుత్వం చేస్తున్న వాదనలను అపహాస్యం చేస్తున్నాయన్నారు.
మణిపూర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పుడే మెరుగుపడే సూచనలు కనిపించడం లేదన్నారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తారు. కానీ, జాతి హింసకు గురై అల్లర్లతో అతలాకుతలమైన మణిపూర్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపరు. ఆ రాష్ట్రానికి వెళ్లి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు చొరవ తీసుకోవడానికి మోదీ నిరాకరిస్తున్నారు’ అని అన్నారు.
Also Read..
coaching centres | కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం : ఢిల్లీ మంత్రి అతిషీ
Veena George | కారు ప్రమాదానికి గురైన కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్.. వయనాడ్ వెళ్తుండగా ఘటన