శనివారం 30 మే 2020
National - May 14, 2020 , 13:32:16

మహారాష్ట్రలో కూడా కరోనా ఫ్రీ జిల్లా

మహారాష్ట్రలో కూడా కరోనా ఫ్రీ జిల్లా

ముంబై: కరోనా వైరస్‌తో అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రం అనగానే టక్కున గుర్తొస్తుంది మహారాష్ట్ర. దేశంలో అత్యధిక పాజిటివ్‌ కేసులు, కరోనా మరణాలు ఆ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. మరి అలాంటి రాష్ట్రంలో కూడా ఓ జిల్లా గ్రీన్‌ జోన్‌లో ఉన్నది. రాష్ట్రంలోని 36 జిల్లాలో ఆ ఒక్కటి మినహా అన్ని జిల్లాలు కరోనాతో అల్లకల్లోలం అవుతున్నాయి. అయినా ఇప్పటి వరకు ఆ జిల్లాలో మాత్రం ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదుకాకపోవడం విశేషం. అదే రాష్ట్ర రాజధాని ముంబైకి 900 కి.మీ.పైగా దూరంలో ఉన్న గడ్చిరోలి జిల్లా. విదర్భ రీజియన్‌లో ఉన్న ఆ జిల్లాలో సుమారు 12 లక్షల జనాభా ఉన్నది. ఇప్పటికీ అక్కడ ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదవలేదని జిల్లా కలెక్టర్‌ దీపక్‌ సింగ్లా పేర్కొన్నారు. 

కాగా, ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి దేశంలోని విధ ప్రాంతాల నుంచి జిల్లాకు సుమారు 18 వేల మంది వలస కూలీలు తరలి వచ్చారని, వారిని నేరుగా వారి స్వగ్రామాలకు పంపించకుండా, క్షుణ్ణంగా పరిశీలించి 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నామని, మరో 14 రోజులపాటు తప్పనిసరిగా స్వీయ నిర్బంధంలో ఉండాలనే షరతుపైనే వారిని సొంతూర్లకు వెళ్లనిస్తున్నామని ఆయన చెప్పారు. గడ్చిరోలి జిల్లా ఇప్పటివరకు గ్రీన్‌ జోన్‌లో ఉన్నదని, దాన్ని అలాగే కొనసాగేలా చూస్తామన్నారు. 

ఒకవేల జిల్లాలో పాజిటివ్‌ కేసు నమోదైనా అవి జిల్లా ప్రజలకు వచ్చే అవకాశం లేదని, బయటి నుంచి వచ్చినవారై ఉంటారని చెప్పారు. అయినా జిల్లాలో కరోనా కేసులు నమోదుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.


logo