CJI : భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ని మహారాష్ట్ర చట్టసభ్యులు సన్మానించనున్నారు. ఈ నెల 8న మహారాష్ట్ర విధాన్ భవన్లోని సెంట్రల్ హాల్లో సన్మాన కార్యక్రమం జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్ భారత న్యాయవ్యవస్థలోనే అత్యున్నత పదవిని అధిరోహించి మహారాష్ట్రకు గర్వకారణంగా నిలువడంతో ఆయనను ఘనంగా సన్మానించాలని ఆ రాష్ట్ర చట్టసభ్యులు నిర్ణయించారు.
ఈ విషయాన్ని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ సభాముఖంగా ప్రకటించారు. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఈ ఏడాది మే 14న భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. దాంతో ఆయన భారతదేశపు రెండో దళిత ప్రధాన న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు. ఆయన కంటే ముందు 2007లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ సీజేఐగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన భారత తొలి దళిత సీజేఐగా చరిత్రికెక్కారు.