భోపాల్: విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నది. విమానయాన బిల్లు రోజుకు రూ.21 లక్షలకు చేరింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. (Madhya Pradesh) మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతాప్ గ్రేవాల్, పంకజ్ ఉపాధ్యాయ్ లేవనెత్తిన ప్రశ్నలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 2021 జనవరి నుంచి 2025 నవంబర్ వరకు ప్రైవేట్ విమానాలు, హెలికాప్టర్ల అద్దెల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.290 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రైవేట్ వైమానిక ఆపరేటర్లకు అత్యధికంగా రూ. 90.7 కోట్లు చెల్లించింది.
కాగా, జనవరి 2024 నుంచి నవంబర్ 2025 వరకు ప్రైవేట్ విమానాలు, హెలికాప్టర్ల అద్దెల కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.143 కోట్లు ఖర్చు చేసింది. సుమారు 23 నెలల్లో నెలకు దాదాపు రూ. 6.2 కోట్లు లేదా రోజుకు సగటున రూ. 20-21 లక్షలు వ్యయం చేసింది. దీనికి ముందు మూడు ఏళ్లల్లో 2021 జనవరి నుంచి 2023 డిసెంబర్ వరకు ప్రభుత్వం రూ.147 కోట్లు ఖర్చు చేసింది. అంటే నెలకు దాదాపు రూ. 4.1 కోట్లు లేదా రోజుకు సగటున రూ.13 నుంచి రూ.14 లక్షలు వ్యయమైంది.
మరోవైపు 2019లో మధ్యప్రదేశ్ రాష్ట్ర విమానాల అద్దె వ్యయం ఏటా రూ.1.63 కోట్లు ఉన్నది. అయితే 2025 నాటికి అది రూ.90.7 కోట్లకుపైగా పెరిగిందని సీఎం మోహన్ యాదవ్ అంగీకరించారు. కోవిడ్ తర్వాత పర్యాటకంతోపాటు విమానాల డిమాండ్ పెరుగడం, లోక్‌సభ ఎన్నికలు, ఇంధనంతోపాటు నిర్వహణ ఖర్చులు తీవ్రంగా పెరుగడం వంటి కారణాల వల్ల అద్దె రేట్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. దీంతో ప్రైవేట్ విమానం, హెలికాప్టర్ ఛార్జీలు 20-30 శాతం పెరిగాయి. 2022-23లో గంటకు రూ.4.45 లక్షలుగా ఉన్న ధరలు 2024లో రూ.5.70 లక్షలకు పెరిగాయి. కొన్ని సంస్థల హెలికాప్టర్ ధరలు గంటకు రూ.5.29 లక్షలకు చేరుకున్నాయి.
2021 మేలో కూలిపోయిన ఆ రాష్ట్ర ప్రభుత్వ విమానం గ్వాలియర్ ఎయిర్‌బేస్‌లో నిలిచిపోయింది. నాలుగేళ్లుగా మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ప్రైవేట్ విమానయాన సంస్థలపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీని ఫలితంగా ఖర్చులు పెరుగుతున్నాయని వెల్లడించింది. అయితే గ్రౌండ్ చేసిన ప్రభుత్వ విమానాలకు నాలుగేళ్లుగా ప్రభుత్వం ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రశ్నించింది. గత 20 ఏళ్లలో రాష్ట్ర అప్పు 16 రెట్లు పెరిగి రూ. 20,000 కోట్ల నుంచి రూ. 4.64 లక్షల కోట్లకు పెరుగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఏటా రూ. 27,000 కోట్లు వడ్డీకే చెల్లిస్తుండటంపై అసెంబ్లీలో మండిపడింది.
Also Read:
Woman’s Jaw Dislocates | పానీపూరీ తినేందుకు పెద్దగా నోరు తెరిచిన మహిళ.. విరిగిన దవడ
Watch: కస్టమర్‌గా నటించి.. బంగారు గొలుసులు ఎత్తుకెళ్లిన వ్యక్తి