భోపాల్: పోలీస్ శాఖలో చేరిన ఒక కానిస్టేబుల్ చాలా కాలంగా డ్యూటీకి హాజరుకాలేదు. అయినప్పటికీ ప్రతి నెల జీతం అందుకున్నాడు. ఇప్పటి వరకు రూ.28 లక్షలకుపైగా వేతనం తీసుకున్నాడు. (cop earned without doing duty) 12 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని పోలీస్ శాఖ గుర్తించింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. 2011లో ఒక వ్యక్తి కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. తొలుత భోపాల్ పోలీస్ లైన్స్‌లో అతడ్ని నియమించారు. కొన్ని రోజుల తర్వాత ట్రైనింగ్ కోసం సాగర్ పోలీస్ శిక్షణ కేంద్రానికి పంపారు.
కాగా, ఆ కానిస్టేబుల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ చేయలేదు. విదిషలోని తన ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. దీని గురించి పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వలేదు. అలాగే సెలవు కూడా కోరలేదు. అనంతరం స్పీడ్ పోస్ట్ ద్వారా సర్వీస్ రికార్డును భోపాల్ పోలీస్ లైన్స్‌కు తిరిగి పంపాడు. అయితే ధృవీకరించకుండానే ఆ ప్రతాలను ఆమోదించారు.
మరోవైపు ఆ కానిస్టేబుల్ ట్రైనింగ్ సెంటర్‌కు హాజరుకాకపోవడాన్ని, అలాగే భోపాల్ పోలీస్ లైన్స్‌లో విధులు నిర్వహించకపోవడాన్ని ఎవరూ కూడా పట్టించుకోలేదు. అతడు డ్యూటీలో ఉన్నట్లుగా అంతా భావించారు. ప్రతి నెలా అతడి బ్యాంకు ఖాతాలో జీతం జమ చేశారు. ఇలా 12 ఏళ్ల పాటు ఎలాంటి పోలీస్ విధులు నిర్వహించకుండానే ఆ వ్యక్తి రూ.28 లక్షలకుపైగా వేతనం పొందాడు.
కాగా, 2011 బ్యాచ్ కానిస్టేబుల్స్ పే గ్రేడ్ పెంచేందుకు 2023లో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈ విషయం బయటపడింది. దీంతో 12 ఏళ్లుగా విధులకు హాజరుకాకుండా జీతం పొందుతున్న ఆ కానిస్టేబుల్ సంగతి తెలిసి అధికారులు షాక్ అయ్యారు. అతడి రికార్డులు, సర్వీస్ వివరాలు కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం వెళ్లింది. ఈ నేపథ్యంలో అంతర్గతంగా విచారణ జరిపారు.
మరోవైపు ఆ కానిస్టేబుల్‌ను భోపాల్ పోలీస్ లైన్స్‌కు పిలిపించి ప్రశ్నించారు. అయితే తాను మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని అతడు తెలిపాడు. అందుకే ఇన్నేళ్లుగా విధులకు హజరుకాలేదని చెప్పాడు. దీనికి సంబంధించిన పత్రాలు చూపించాడు. రూ.1.5 లక్షలు తిరిగి ఇచ్చాడు. మిగతా డబ్బులు కూడా ఇస్తానని అన్నాడు. ఈ సంఘటనపై పోలీస్ అధికారులు మరింతగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశంలో నిర్లక్ష్యం వహించిన పోలీస్ సిబ్బంది, అధికారులపైనా చర్యలకు సిద్ధమవుతున్నారు.
Also Read:
Mooli Devi | పోలీసులనే బురిడీకొట్టించిన మహిళ.. పోలీస్ అకాడమీలో ఎస్ఐగా రెండేళ్లు ట్రైనింగ్
Watch: రైలు పట్టాల మధ్యలో పడుకున్న బాలుడు, వేగంగా వెళ్లిన రైలు.. తర్వాత ఏం జరిగిందంటే?