జైపూర్: ఒక మహిళ ఏకంగా పోలీసులనే బురిడీకొట్టించింది. సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)గా సెలక్టైనట్లు నకిలీ పత్రాలు సృష్టించింది. పోలీస్ అకాడమీలో రెండేళ్ల పాటు ట్రైనింగ్ పొందింది. (Mooli Devi) ఐపీఎస్ అధికారులతో కలిసి ఫొటోలు దిగింది. రీల్స్ చేసింది. ఏడీజీతో టెన్నిస్ ఆడింది. అయినా ఆమె నకిలీ అన్నది ఎవరూ గుర్తించలేదు. చివరకు మిగతా ట్రైనీలు అనుమానం వ్యక్తం చేయడంతో ఆ మహిళ గుట్టురట్టయ్యింది. బీజేపీ పాలిత రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. నాగౌర్ జిల్లాలోని నింబా కే బాస్ గ్రామానికి చెందిన మోనా బుగాలియా, 2021లో సబ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్షలో ఉత్తీర్ణత కాలేదు. అయితే ‘మూలి దేవి’ పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించింది. సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)గా ఎంపికైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నది. ఎస్ఐ నియామకాలకు సంబంధించిన ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లో ఆమె చేరింది. స్పోర్ట్స్ కోటా ద్వారా ముందు బ్యాచ్‌కు చెందిన అభ్యర్థిగా పరిచయం చేసుకున్నది. రాజస్థాన్ పోలీస్ అకాడమీలోకి ప్రవేశించింది.
కాగా, మోనా బుగాలియా అలియాస్ మూలి దేవి రెండేళ్లపాటు రాజస్థాన్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఎస్ఐగా శిక్షణ పొందింది. యూనిఫాంలో పరేడ్ గ్రౌండ్స్‌లో కనిపించడంతోపాటు రిహార్సిల్స్‌లో పాల్గొన్నది. ఐపీఎస్ అధికారులతో ఫొటోలు దిగింది. సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేసింది. పోలీస్ యూనిఫాం ధరించి ఐపీఎస్, సీనియర్ పోలీస్ అధికారుల సమక్షంలో బహిరంగ వేదికపై కెరీర్ అవగాహనపై ప్రసంగాలు ఇచ్చింది. పోలీస్ అకాడమీలోని నిషేధిత ప్రాంతాల్లో కూడా స్వేచ్ఛగా తిరిగింది. అయినా ఆమె నకిలీ ట్రైనీ ఎస్ఐ అన్నది ఎవరూ గుర్తించలేదు.
మరోవైపు 2023లో కొంతమంది ట్రైనీ ఎస్ఐలు మోనా బుగాలియా గుర్తింపుపై అనుమానం వ్యక్తం చేశారు. సీనియర్ పోలీస్ అధికారులకు ఆమె గురించి సమాచారం ఇచ్చారు. దీంతో అంతర్గతంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో నకిలీ గుర్తింపుతో పోలీస్ అకాడమీలో ఎస్ఐగా ఆమె శిక్షణ పొందుతున్నట్లు బయటపడటంతో కేసు నమోదైంది.
కాగా, 2023 నుంచి పరారీలో ఉన్న మోనాను సికర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నివసించిన అద్దె ఇంటిలో తనిఖీలు చేశారు. రూ.7 లక్షల నగదు, మూడు ప్రత్యేక పోలీసు యూనిఫామ్స్, రాజస్థాన్ పోలీస్ అకాడమీకి చెందిన పరీక్షా పత్రాలు, తప్పుడు గుర్తింపు కోసం వినియోగించిన నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు మోనా బుగాలియా తండ్రి లారీ డ్రైవర్. నలుగురు అక్కాచెల్లెళ్లున్న తన కుటుంబాన్ని ఆకట్టుకునేందుకు, పోలీస్ అధికారాన్ని దుర్వినియోగం చేసేందుకు తాను ఇలా చేసినట్లు ఆమె ఒప్పుకున్నది. అయితే అత్యంత భద్రత ఉన్న రాజస్థాన్ పోలీస్ అకాడమీలో నకిలీ ట్రైనీగా రెండేళ్ల పాటు ఆమె శిక్షణ పొందినప్పటికీ గుర్తించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read:
Black Magic | భార్య, అత్తను నగ్నంగా చేతబడి చేయాలని వ్యక్తి బలవంతం.. ఆ ఫొటోలు లీక్
Woman, Lover Arrested | భర్త, పిల్లలకు విషమిచ్చి చంపేందుకు యత్నం.. భార్య, ఆమె ప్రియుడు అరెస్ట్
Watch: తనను చూసి మొరుగుతున్నదని.. కుక్కపై రిటైర్డ్ పీడబ్యూడీ ఇంజినీర్ కాల్పులు