Lok Sabha : ప్రధాన మంత్రి (Prime Minister) గానీ, ముఖ్యమంత్రులు (Chief Ministers) గానీ, మంత్రులు (Ministers) గానీ తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయ్యి వరుసగా 30 రోజులపాటు జైల్లో నిర్బంధంలో ఉంటే అట్టి వారిని పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే మూడు బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) మంగళవారం లోక్సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది.
కేంద్రం హడావిడిగా లోక్సభలో ప్రవేశపెట్టిన ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం, సమాఖ్య వాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు విపక్షాలు ఆరోపించాయి. అయితే ఈ బిల్లులను హడావిడిగా తీసుకొచ్చారనే విమర్శలను అమిత్ షా తోసిపుచ్చారు. వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు లోకసభలో తీర్మానం ప్రవేశపెట్టగా ఆ తీర్మానానికి దిగువ సభ ఆమోదం తెలిపింది.
అంతకుముందు మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు బిల్లుల ప్రతులను చించిపారేశారు. వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా అరెస్టయిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లేవనెత్తారు. దీన్ని అమిత్ షా ఖండించారు. అరెస్టుకు ముందే నైతిక కారణాలతో తాను రాజీనామా చేశానని, కోర్టు నిర్దోషిగా ప్రకటించాకే ప్రభుత్వంలో చేరానని చెప్పారు.
తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ నాయకులు రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో కొనసాగడం తగదని అమిత్ షా అన్నారు. అయినా ఆ మూడు బిల్లులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. స్పీకర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సభ్యులు పట్టించుకోలేదు. దాంతో సభను ముందుగా మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో సాయంత్రం 5 గంటల వరకు వాయిదా వేశారు.