Lok Sabha Adjourned : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలి రోజే వాడీవేడిగా జరిగాయి. ఇటు అధికార పక్షం, అటు విపక్షాలు ప్రతినిధులు పరస్పరం నినాదానాలతో హెరెత్తించారు. ‘ఆపరేషన్ సిందూర్’, ఎయిరిండియా విమాన ప్రమాదంపై విపక్ష ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలని పట్టుబట్టారు. స్పీకర్ ఓం బిర్లా ఎంత వారించినా వాళ్లు నిరసనకు దిగడంతో లోక్‌సభ (Lok Sabha) రేపటికి వాయిదా పడింది. సభ మొదలైన కాసేపటికే మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు స్పీకర్ బిర్లా (Om Birla). అయితే.. ఆ తర్వాత కూడా విపక్షాలు పట్టువీడకపోవడంతో చివరకు రేపటికి సభను వాయిదా వేయాల్సి వచ్చింది.
సభ మొదలైన కాసేపటికే ఆపరేషన్ సిందూర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. భారత్, పాక్‌ల మధ్య యుద్ధాన్ని నేను ఆపాను అంటూ ట్రంప్ ప్రగల్భాలు పలకడంపై మోడీ సభా వేదికగా వివరించాలని పట్టుబట్టారు కాంగ్రెస్ ఎంపీలు. అయితే.. స్పీకర్ ఓం బిర్లా తర్వాతి చర్చల్లో అందుకు అనుమతిస్తానంటూ చెప్పారు. అయినా సరే కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ ఎంపీలు ప్రధాని మాట్లాడాల్సిందేనని పట్టుబట్టారు. దాంతో, సెషన్ ఆరంభమైన 20 నిమిషాలకే వాయిదా వేశారు స్పీకర్.
#WATCH | After Lok adjourned till 2 pm on the first day of the Monsoon session, LoP Lok Sabha Rahul Gandhi says, “The question is – the Defence Minister is allowed to speak in the House, but Opposition members, including me, who is the LoP, are not allowed to speak…This is a… pic.twitter.com/bD3ELbiEkd
— ANI (@ANI) July 21, 2025
ఎయిరిండియా విమాన ప్రమాదంపై మాట్లాడిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విదేశీ మీడియా తప్పుడు కథనాలను ఖండించారు. దర్యాప్తు చేపడుతున్న ఏఏఐబీ సంస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, తుది నివేదిక వచ్చాకే అన్ని విషయాలు తెలుస్తాయని సభ్యులకు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని వాపోయారు. ‘సభలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడారు. కానీ, లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత అయిన నాకు మాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు’ అని రాహుల్ కేంద్రంపై మండిపడ్డారు.