LeT commander | పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)వెనుక మాస్టర్ మైండ్‌గా భావిస్తున్న లష్కరే తోయిబా కమాండర్ (LeT commander) సైఫుల్లా కసూరి (Saifullah Kasuri) పాక్‌లో ప్రత్యక్షమయ్యారు. తాజాగా అక్కడ చేపట్టిన ఓ ర్యాలీలో పాక్ రాజకీయ నాయకులు, ఇతర వాంటెడ్ ఉగ్రవాదులతో కలిసి కనిపించారు.
దేశ అణు పరీక్షల వార్షికోత్సవం సందర్భంగా పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో అతడు పాల్గొని ప్రసంగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ర్యాలీలో సైఫుల్లా కసూర్ మాట్లాడుతూ.. ‘పహల్గాం ఉగ్రదాడిలో నన్ను ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్నారు. ఇప్పుడు నా పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది’ అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని నిమిషాల పాటు ప్రసంగించిన సైఫుల్లా భారత వ్యతిరేక నినాదాలు చేశాడు. ఇదే ర్యాలీలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది తల్హా సయీద్ కూడా పాల్గొన్నాడు. అతడు కూడా భారత వ్యతిరేకతను పెంచేలా ప్రసంగించాడు. ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అక్కడి రాజకీయ నేతలతో వేదికను పంచుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
గత నెల 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై అడవిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి కంటికి కనిపించిన పురుషులను కాల్చుకుంటూ పోయారు. ఈ దాడిలో సుమారు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్ (Lashkar commander) హస్తం ఉన్నట్లు తెలిసింది. ఈ మారణహోమానికి ప్రధాన సూత్రధారిగా సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీదే అని నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రదాడికి అతడే ప్లాన్ చేసినట్లు సమాచారం. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఖలీద్‌ను కరుడుగట్టిన ఉగ్రవాదిగా ఎన్ఐఏ పేర్కొంటోంది. ప్రస్తుతం అతడు ఇస్లామాబాద్ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు చేపడుతున్నట్లు సమాచారం. ఐఎస్ఐ, పాక్ ఆర్మీతో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఖలీద్‌తోపాటు ఈ దాడికి ప్లాన్ చేసిన వారిలో పీవోకేకి చెందిన ఇద్దరు వ్యక్తులు హస్తం ఉందని నిఘా సంస్థలు గుర్తించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
Also Read..
PM Modi | ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఆపరేషన్ సిందూర్ తగిన సమాధానం : ప్రధాని మోదీ
Rajnath Singh: పీవోకే ప్రజలు స్వచ్ఛంధంగా భారత్‌కు తిరిగి వస్తారు: రాజ్‌నాథ్ సింగ్
Spying | పాక్‌కు గూఢచర్యం.. కాంగ్రెస్ నేత మాజీ పీఏ అరెస్ట్