Waqf Bill | వివాదాస్పద వక్ఫ్(సవరణ) బిల్లు (Waqf Bill) లోక్‌సభ (Lok Sabha) ముందుకు వచ్చింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఈ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rjiju) సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో విపక్షాలు నిరసన తెలిపాయి. బిల్లును సభలో ప్రవేశపెట్టమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. కేంద్ర మంత్రిని కోరగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీని (Waqf Amendment Bill)పై రిజుజు చర్చ చేపట్టారు. ఈ బిల్లుపై చర్చకు 8 గంటలు కేటాయించారు. చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఓటింగ్ అనంతరం లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
ఈ బిల్లును ఎట్టి పరిస్థితిల్లోనూ ఇదే సమావేశంలో ఆమోదించాలని అధికార పక్షం భావిస్తోంది. అయితే, రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును సమైక్యంగా వ్యతిరేకించాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఈ బిల్లు లోక్‌సభలో గట్టెక్కాలంటే 272 ఓట్లు కావాల్సి ఉంది. ప్రస్తుతం సభలో బీజేపీకి సొంతంగా 240 మంది ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీకి 16, జేడీయూకు 12 మంది సభ్యులున్నారు. ఈ రెండు పార్టీలే కాకుండా ఎల్జేపీకి ఐదుగురు, ఆర్ఎల్డీకి ఇద్దరు, శివసేన (షిండే)కు ఏడుగురు ఎంపీలు ఉన్నారు. మొత్తంగా బీజేపీకి సభలో 282 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయా పార్టీలు ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. దీంతో ఈ సభలో ఓట్లు తమకే అనుకూలంగా వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. దీనిపై ఎగువ సభలో చర్చ ఉంటుంది. చర్చ అనంతరం అక్కడ కూడా ఓటింగ్ నిర్వహించనున్నారు. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 119 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. అయితే, బీజేపీకి సొంతంగా 98 మంది ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలతో కలిపి 125 మంది సభ్యుల మద్దతు ఉంటుంది.
దేశంలో మొదటిసారిగా వక్ఫ్ చట్టాన్ని 1954లో తీసుకొచ్చారు. అనంతరం దానికి మరిన్ని అధికారాలు కట్టబెడుతూ 1995లో చట్టాన్ని సవరించారు. 2013లో మరోసారి సవరించారు. ఇందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం, ఏ కోర్టుల్లోనూ సవాల్ చేయలేని విధంగా, ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే ప్రత్యేక అధికారాలు బోర్డులకు కల్పించారు. నేడు దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులున్నాయి. తమిళనాడులోని వక్ఫ్ బోర్డు తాజాగా ఓ గ్రామం మొత్తం తమదేనంటూ ప్రకటించటం వివాదానికి దారి తీసింది.
వక్ఫ్ బోర్డులకు అపరిమిత అధికారాలకు చెక్ పెట్టేందుకు వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసే విధంగా కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటుచేసుకోనున్నాయి. తాజా సవరణల ద్వారా వక్ఫ్ ఆస్తులపై కేంద్ర, రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలను కట్టడి చేయడం వల్ల వక్ఫ్ బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శకత ఏర్పడుతుందని కేంద్రం భావిస్తున్నది. సెంట్రల్, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిథ్యం కల్పించాలని బిల్లు పేర్కొన్నది. ఈ బిల్లును గతేడాది ఆగస్టులోనే కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అప్పుడు దీనిపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపింది. ఈ కమిటీ పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది.
Also Read..
MK Stalin | డీలిమిటేషన్ సెగ.. ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ
Line of Control: నియంత్రణ రేఖ దాటిన పాకిస్థాన్ ఆర్మీ.. ఫైరింగ్‌ను తిప్పికొట్టిన భారత బలగాలు
Karnataka | బెంగళూరులో ఇకపై చెత్త పన్ను.. యూజర్ చార్జీల పేరిట కాంగ్రెస్ సర్కారు మరో భారం