Karnataka | బెంగళూరు, ఏప్రిల్ 1 : కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు రోజుకో పన్నుతో ప్రజలను హడలెత్తిస్తున్నది. కాదేదీ పన్నుకు అనర్హం అన్నట్టుగా ప్రతిదానిపైనా ట్యాక్స్ విధిస్తున్నది. చివరకు చెత్తను కూడా వదల్లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ, మెట్రో, వాహన రిజిస్ట్రేషన్, పాలు, పెరుగు, విద్యుత్ చార్జీలు, వాటర్, స్టాంప్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, ఔట్ పేషంట్ ఫీజులు, పోస్ట్-మార్టమ్ ఎగ్జామినేషన్ చార్జీలు, మెడికల్ సర్టిఫికెట్ ఫీజులు పెంచి ప్రజలపై భారం మోపిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు చెత్తపైనా పన్ను విధించింది. వ్యర్థాల నిర్వహణ కోసం బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. వ్యర్థాల సేకరణ కోసం ఏప్రిల్ 1 నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. నివాసిత భవనం విస్తీర్ణం ఆధారంగా వీటి చార్జీలను నిర్ణయించింది. 600 చ.అడుగులు లోపు విస్తీర్ణం గల నివాస భవనాలకు ప్రతి గృహం నుంచి నెలకు రూ.10 (ఏడాదికి రూ. 120) యూజర్ చార్జీలుగా వసూలు చేస్తారు. అలాగే 4,000 చ.అడుగులు, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం గల భవనాలకు ప్రతి ఇంటికి నెలకు రూ.400 (ఏడాదికి 4,800) వసూలు చేస్తారు. వాణిజ్య భవనాలకు కేజీకి రూ.12 వంతున తీసుకుంటారు.
అన్ని చార్జీలను పెంచుతూ ప్రజల రక్తం తాగుతున్న సిద్ధరామయ్య సర్కార్ ‘ధరల పెంపు దయ్యం’లా మారిందని కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి విమర్శించారు. కాంగ్రెస్ కంపెనీ మంగళవారం నుంచి చెత్తపై పన్ను విధించిందని, అది ప్రజల రక్తాన్ని తాగుతున్నదని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన గతంలో దేశాన్ని పాలించిన ఈస్టిండియా కంపెనీ తరహాలో ఉందని అన్నారు. ఐదు గ్యారెంటీల అమలు నెపంతో సిద్ధరామయ్య ప్రభుత్వం అన్నింటి ధరలను పెంచుకుంటూ పోతున్నదని, ఇది ప్రజలను దోచుకోవడమేనని అన్నారు. భారత్‌ను ఆక్రమించి నిరంతరం దోచుకున్న గజినీ మహ్మద్, మహమ్మద్ గోరీలు కూడా సిద్ధరామయ్య ప్రభుత్వ దోపిడీని చూసి సిగ్గుపడతారని అన్నారు.
సిద్ధరామయ్య సర్కారు మరోసారి ఇంధన ధరలు పెంచింది. డీజిల్‌పై లీటర్‌కు రూ.2 పెంచుతున్నట్టు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. డీజిల్‌పై ఇప్పటివరకు విధిస్తున్న కర్ణాటక సేల్స్ ట్యాక్స్‌ను 18.4 శాతం నుంచి 21.17 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపుతో కర్ణాటకలో లీటర్ డీజిల్ ధర రూ.91.02కు చేరుకుంది. డీజిల్ చార్జీలు పెంపుతో రైతులు, రవాణా ఆపరేటర్లు, డ్రైవర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంధన ధర పెంపు ప్రభావం అన్ని రంగాలపై పడుతుందని, తద్వారా వాటి ధరలు కూడా పెరుగుతాయని పౌరులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల క్రితమే పాలు లీటర్ ధరను రూ.4 పెంచిన సిద్ధరామయ్య ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది.