న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(Line of Control) వద్ద పాకిస్థాన్ ఆర్మీ హద్దులు దాటింది. పూంచ్ జిల్లాలో పాక్ ఆర్మీ ఈ దుశ్చర్యకు పాల్పడింది. కాల్పులు జరిపిన పాక్ ఆర్మీ చర్యలను భారత్ తిప్పికొట్టింది. ఏప్రిల్ ఒకటో తేదీన కృష్ణ ఘాటీ సెక్టార్ వద్ద పాక్ ఆర్మీ నియంత్రణ రేఖ దాటడం వల్ల మైన్ బ్లాస్ట్ అయినట్లు భారతీయ సైనిక బలగాలు వెల్లడించాయి. ఈ ఘటన తర్వాత ఫైరింగ్ జరిగిందని, పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారతీయ ఆర్మీ పేర్కొన్నది.
భారతీయ బలగాలు సమర్థవంతంగా ఆ ఫైరింగ్‌ను తిప్పికొట్టినట్లు ఆర్మీ వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందని, నిశితంగా ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. పాక్ ఆర్మీ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని భారతీయ ఆర్మీ చెప్పింది. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద శాంతి, సామరస్యాన్ని మెంటేన్ చేయాల్సిన అంశాన్ని డీజీ మిలిటరీ ఆపరేషన్స్‌కు గుర్తు చేసినట్లు భారతీయ ఆర్మీ తెలిపింది. 2021 మీటింగ్‌లో ఇరు వైపుల డీజీ మిలిటరీ ఆపరేషన్స్.. శాంతి స్థాపన కోసం పలు అంశాలను అంగీకరించారని, నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణకు కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్మీ గుర్తు చేసింది.