న్యూఢిల్లీ : మణిపూర్ అల్లర్లపై చర్చకు పట్టుబడుతూ పార్లమెంట్లో విపక్షాలు ఆందోళన చేపట్టడంతో ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. రెండు నెలలుగా ఈశాన్య రాష్ట్రం భగ్గుమంటున్నా మోదీ సర్కార్ మౌనం వీడటం లేదని విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. సభా కార్యకలాపాలను రద్దు చేసి తక్షణమే మణిపూర్ హింసాకాండపై చర్చ చేపట్టాలని పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
లోక్‌సభ, రాజ్యసభలో విపక్ష సభ్యులు ఇండియా ఫర్ మణిపూర్ అని రాసిఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ సభలో మణిపూర్ అల్లర్లపై చర్చ చేపట్టాలని నినాదాలతో హోరెత్తించారు. ఇక రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ తాము మణిపూర్ గురించి మాట్లాడుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఈస్టిండియా కంపెనీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని, స్వాతంత్ర్య సమరయోధులను అవమానిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్ సుర్జీవాలా విమర్శించారు.
అమెరికా పార్లమెంట్లో మాట్లాడేందుకు ప్రధానికి సమయం ఉంటుందని, అయితే దేశ పార్లమెంట్లో మణిపూర్‌పై మాట్లాడేందుకు ఆయనకు సమయం లేదని ఆక్షేపించారు. భారత రాజ్యాంగం, పార్లమెంట్‌ను ప్రధాని మోదీ ఎందుకు ద్వేషిస్తారని సుర్జీవాలా ప్రశ్నించారు. ఇక మణిపూర్ అంశంపై ప్రధాని మాట్లాడాలని విపక్షాలు పట్టుపట్టగా ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడతారని మంత్రి పీయూష్ గోయల్ బదులిచ్చారు. మణిపూర్ అల్లర్ల వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలనూ కుదిపేయగా పలుమార్లు సభ వాయిదా పడింది.
Read More :
Manipur | రెండు రోజుల్లోనే.. మణిపూర్ లోకి ప్రవేశించిన 718 మంది మయన్మార్ జాతీయులు