Jharkhand | జార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక్కడ ఎన్డీయే కూటమికి గట్టి షాక్ తగిలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందలు చేస్తూ హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.
మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ మార్క్ 41 సీట్లు దాటాల్సి ఉంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. ఇండియా కూటమి మ్యాజిక్ మార్క్ 41 సీట్లు దాటేసింది. ప్రస్తుతం 51 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. బర్మైత్లో సీఎం హేమంత్ సోరెన్, గండేలో సీఎం భార్య కల్పనా సోరెన్ ముందంజలో ఉన్నారు. ఇక సరాయ్‌కెలాలో మాజీ సీఎం, బీజేపీ నేత చంపై సోరెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఎన్డీయే కూటమి 29 స్థానాల్లో, ఇతరులు ఒక్క స్థానంలో ముందంజలో ఉన్నారు. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని తహతహలాడిన కమలం పార్టీ ఆశలు గల్లంతయ్యాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలో ఉన్నది. ప్రస్తత ఎన్నికల్లో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) నాలుగు చోట్ల పోటీ చేయగా, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి.. బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, లోక్‌జన్‌శక్తి(రామ్ విలాస్) పార్టీ ఒక చోట పోటీ చేశాయి. ఎన్డీఏ కూటమి 42 నుంచి 48 స్థానాల్లో, జేఎంఎం 25 -30 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైన సంగతి తెలిసిందే.
Also Read..
Ajit Pawar | అబ్బాయ్ ఆశలు ఆవిరి..! బాబాయ్‌కి మళ్లీ పెద్ద పోస్టే వరించేనా..?
Priyanka Gandhi | అన్న రికార్డు బద్దలు కొట్టేనా.. వయనాడ్‌లో తిరుగులేని మెజార్టీ దిశగా ప్రియాంక