వయనాడ్: తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) రికార్డు విజయం నమోదుచేసేలా కనిపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ స్థానం నుంచి ఆమె సోదరుడు రాహుల్ గాంధీ 3,64,422 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన రాజీనామాతో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రియాంకకు అంతకు మించిన ఆధిక్యం వచ్చేలా ఉన్నది. ఓట్ల లెక్కింపు ప్రారంభం అయినప్పటి నుంచే ఆమె లీడ్లో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు తన సమీప ప్రత్యర్థి సీపీఐ క్యాండిడేట్ సత్యన్ మెకేరిపై 68 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ఆమెకు దరిదాపుల్లో కూడా నిలువలేకపోయారు.
సీపీఐ అభ్యర్థి సత్యన్కు 12,714 ఓట్లు రాగా, నవ్యకు 5,995 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా, వయనాడ్ ఉపఎన్నికలో మొత్తం 9.52 లక్షల మంది ఓట్లు వేశారు. అందులో సుమారు 6 లక్షల ఓట్లు ప్రియాంకకు వస్తాయని కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేస్తున్నది. ఇక సీపీఐ అభ్యర్థికి 2 లక్షలు, బీజేపీ క్యాండిడేట్కు లక్ష చొప్పున ఓట్లు వస్తాయని భావిస్తున్నది.