Mallikarjun Kharge : కర్ణాటక (Karnataka) లో ముఖ్యమంత్రి మార్పు జరగనుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shiva Kumar) కు సీఎం పగ్గాలు కట్టబెట్టబోతున్నారని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు (Congress National President) మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) స్పందించారు. కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengalore) లో మీడియా ఈ అంశంపై ప్రశ్నించడంతో ఆయన సమాధానం చెప్పారు.
ముఖ్యమంత్రి మార్పు అంశం పార్టీ హైకమాండ్ చేతిలో ఉందని, పార్టీ హైకమాండ్‌లో ఏం జరుగుతుందనే విషయాన్ని ఏ ఒక్కరూ బయటికి చెప్పరని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ విషయంలో చర్య తీసుకునే హక్కు హైకమాండ్‌కు మాత్రమే ఉందని, కాబట్టి విషయాన్ని హైకమాండ్‌కే వదిలేద్దామని చెప్పారు. దీనిపై ఎవరూ అనవసరమైన సమస్యలు సృష్టించవద్దని ఆయన కోరారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు వార్తలు నిజమేనా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఖర్గే పైవిధంగా స్పందించారు.
డీకే శివకుమార్ కర్ణాటక సీఎం కాబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ ఆదివారం అదే విషయం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరో రెండుమూడు నెలల్లో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశముందని హుస్సేన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసని.. ప్రస్తుతం హైకమాండ్ శివకుమార్ గురించే యోచిస్తోందని అన్నారు. డీకే శివకుమార్‌కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది.