Actor | సినిమా ఇండస్ట్రీలో పెద్ద నటుడవాలని కలలు కంటూ ముంబయి, చెన్నైల వంటి నగరాలకు వెళ్లే వారు ఎందరో ఉన్నారు. అయితే అందరికీ అవకాశాలు తలుపుతట్టవు. కొన్ని సందర్భాల్లో కొన్ని పాత్రలు వారిని వెలుగులోకి తీసుకువచ్చినా , అలా వచ్చిన అవకాశాలు వారి జీవితాన్ని మార్చే స్థాయికి తీసుకురావు. 2013లో అజిత్ హీరోగా, విష్ణువర్థన్ దర్శకత్వంలో వచ్చిన హిట్ చిత్రం ‘ఆరంభం’ లో టెర్రరిస్ట్ గ్యాంగ్‌లో ఒకరిగా నటించిన సవి, తన నటనతో ఆకట్టుకున్నా, ఆ తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయాడు. లక్నోకు చెందిన సవి సింధు, లా చదివినా, సినిమాల పట్ల ఉన్న ప్యాషన్ కారణంగా నటన వైపు వచ్చారు. బాలీవుడ్లో కూడా చిన్నా చితకా పాత్రలు పోషించారు.
అయితే అవేమి ఆయన కెరీర్‌కి ఉపయోగపడలేదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సినిమా అవకాశాలు రాక, కుటుంబం నుండి కూడా దూరమైన సవి సింధు, ప్రస్తుతం రోజుకు 12 గంటల పాటు వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. రోజువారీ అవసరాలు తీర్చుకోవడమే సవాలుగా మారిందని, థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలన్న చిన్న కోరికను కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమలో చాలామంది స్టార్లు బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఎదిగారు. చిరంజీవి, రజినీకాంత్, నాని, శివకార్తికేయన్, అజిత్ లాంటి వారు వారి ప్రతిభతో సత్తా చాటారు.
అజిత్ విషయానికి వస్తే, నటనతో పాటు కార్ రేసింగ్‌లోనూ ఆయన టాలెంట్ చూపిస్తూ, ఇటీవలే పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అయితే, అజిత్ సినిమా ‘ఆరంభం’లో నటించిన ఈ నటుడు మాత్రం, జీవితంలో వెనుకబడిపోయాడు. “ఒకప్పుడు సినిమాల్లో నటించాను, కానీ ఇప్పుడు కేవలం బతకడానికే పోరాటం చేస్తున్నాను” అని అంటున్న సవి, బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి సహాయం అందుతుందేమో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు కాకపోయిన ఎవరైన సరే మానవత్వంతో ఆయనకి ఎంతో కొంత సాయం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.