నిజామాబాద్, ఫిబ్రవరి 27, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పసుపు కొనుగోళ్లకు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ పెట్టింది పేరు. ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాల నుంచి పసుపు రైతులు తమ పంటను అమ్ముకునేందుకు ఇక్కడికే వస్తుంటారు. ఏటా నూతన సంవత్సరం ఆరంభం నుంచి పసుపు క్రయ, విక్రయాలు జరుగుతుంటాయి.
రైతులకు ఈ ప్రక్రియలో ఏటా నష్టాలు ఎదురవుతున్నాయి. గతంలో జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో సమన్వయ భేటీలు జరిగేవి. యోగితా రాణా, ఎంఆర్ఎం రావు, నారాయణ రెడ్డిలు కలెక్టర్లుగా పని చేసినప్పుడు వరుసగా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు, వ్యాపారులు, రైతు సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు గుర్తించి పరిష్కరించేది. ఈ-నామ్ వ్యవస్థ సంసిద్ధత, తూకం యంత్రాలు, కుర్కుమిన్ పరీక్షించే సాధనాలు, ఆన్లైన్ బిడ్డింగ్ సమస్యలు, ట్రేడర్ల సహకారం, గిట్టుబాటు ధర, మార్కెట్ యార్డులో రైతులకు కనీస సౌకర్యాలు వంటి అంశాలపై చర్చించి మార్గనిర్దేశం చేసేవారు.
ఈ సమావేశాల వల్ల గతంలో నిజామాబాద్ మార్కెట్ యార్డు ఉత్తమ ఈ-నామ్ మార్కెట్‌గా అవార్డు సాధించింది. ఈ ప్రాక్టీస్ మూలంగానే కేసీఆర్ పాలనలో రైతులు సమస్యలు ఎదుర్కొనకుండా సజావుగా పసుపు అమ్ముకున్నారు. కలెక్టర్‌గా రాజీవ్‌గాంధీ హనుమంతు వచ్చిన తర్వాత ఈ ప్రక్రియకు బ్రేక్ పడినైట్లెంది. సమన్వయ భేటీలు లేకపోవడంతో గిట్టుబాటు ధరతో పాటుగా అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. అందులో భాగంగానే ఫిబ్రవరి 26న వెలుగు చూసిన రైతుల ఆందోళన ఉదాహారణగా నిలుస్తోంది.
ఈ-నామ్ వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అమల్లోకి తీసుకు వచ్చింది. నిజామాబాద్‌కు 2019 నుంచి బీజేపీ ఎంపీగా ధర్మపురి అర్వింద్ కొనసాగుతున్నాడు. సొంత నియోజకవర్గంలో ఈ-నామ్‌తో ఇబ్బందులు తలెత్తితే రైతులు ఆందోళన చేసే వరకు పట్టింపు లేకపోవడం శోచనీయంగా మారింది.
బీజేపీ ఎంపీ ముందస్తుగానే అప్రమత్తమై రైతులు, రైతు సంఘాలు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు, వ్యాపారులతో సమావేశం పెడితే ఇబ్బందులు వచ్చేవి కాదు కదా? అన్న చర్చ నడుస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజీగా గడిపిన బీజేపీ ఎంపీకి రైతుల సమస్యలు ఎందుకు గుర్తుకు రాలేదంటూ కర్షకులు ప్రశ్నిస్తున్నారు. ఈ-నామ్ అప్‌గ్రేడ్ అనేది పసుపు కొనుగోళ్ల సమయంలోనే చేపట్టడం ఏంటని నిలదీస్తున్నారు.
అంతకు ముందే ఈ-నామ్ 2.0ను ఎందుకు అప్‌గ్రేడ్ చేయలేదని అడుగుతున్నారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపి రైతులను ఆర్థికంగా బలి చేసేందుకు ఏమైనా కుట్రలు జరిగాయా? అన్న చర్చ నడుస్తోంది. 2026 సీజన్‌కు సంబంధించి ఈ-నామ్ 2.0 అప్‌గ్రేడ్‌లో వచ్చిన టెక్నికల్ సమస్యలు అనేవి పసుపు రైతులకు తెలియకుండానే పసుపు కొనుగోళ్లు మొదలయ్యాయి. స్లాట్ బుకింగ్ ఆగిపోవడం, కొనుగోళ్లు ఆలస్యం కావడం వంటి సమస్యలు ఎదురయ్యే వరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతుల ఆందోళనకు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ దిగొచ్చారు. కేంద్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ-నామ్ 1.0 పరిధిలోనే పసుపు కొనుగోళ్లు జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇదే చొరవను సీజన్ ప్రారంభానికి ముందే చూపి ఉంటే రైతులంతా ఆందోళన చేసేంత పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా? అని మార్కెట్ యార్డు వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పాలకులతోపాటుగా బీజేపీ ఎంపీ, నిజామాబాద్ జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తించడం మూలంగానే ఇదంతా జరిగిందని అంటున్నారు.
ఎంపీ అర్వింద్ ముందస్తుగా సమన్వయ సమావేశం పెట్టి సమస్యలు గుర్తించి ఉంటే ఈ ఇబ్బంది రాకుండా ఉండేది అని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. పసుపు కొనుగోళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నిజామాబాద్ మార్కెట్ యార్డులో సమన్వయం అన్నది కీలకం. ఇందులో జిల్లా కలెక్టర్‌తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, మార్కెట్ కమిటీ పాలకవర్గం, బీజేపీ ఎంపీ పరస్పరం అవగాహనతో ముందుకు కదిలితే రైతులకు ప్రయోజనం జరుగుతుంది. లేకపోతే లోటుపాట్లు పరిష్కారం కాకుండానే పడి ఉండే ప్రమాదం ఉంది. ఈ-నామ్ 2.0 మంచిదే అయినప్పటికీ రైతులకు ఇబ్బంది కలుగకుండా ముందస్తు ప్రణాళికతో అమలు చేయడం మంచిదనే భావన వ్యవసాయ నిపుణులు, రైతుల్లో ఏర్పడుతోంది. పసుపు రైతుల హక్కుల కోసం ముందస్తు సమన్వయం ఎంత ముఖ్యమో రైతుల ఆందోళన తేటతెల్లం చేస్తోంది.