కొల్చారం/ కౌడిపల్లి, ఫిబ్రవరి 27 : ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. కౌడిపల్లికి చెందిన రెడ్డి శేఖర్ (40)కు వ్యవసాయ బోరుబావులు తవ్వించడంతో పాటు అనారోగ్యంతో దవాఖానల్లో చూపించుకోవడానికి రూ.5 లక్షల వరకు అప్పులు అయ్యాయి. 10 గుంటల భూమిలో పంటలు సాగుచేసినా ఆదాయం అంతంతమాత్రంగానే వచ్చేది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో పాలుపోక తీవ్ర ఆవేదన చెందేవాడు.
శుక్రవారం బహిర్భూమికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకగా, కౌడిపల్లి శివారులోని చెరువుకట్ట సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి నర్సాపూర్ ఏరియా దవాఖానకు తరలించారు.
మెదక్ జిల్లా కొల్చారం పోలీస్స్టేషన్ పరిధిలోని చిన్నఘన్పూర్లో అప్పులబాధతో రైతు ఎరుకల రత్నయ్య(45) ఆత్మహత్య చేసుకున్నాడు. రత్నయ్యకు ఎకరంగా పైగా వ్యవసాయ భూమి ఉండగా అందులో పంటలు పండించేవాడు. నిరుడు కూతురు వివాహం చేయడం, పంటసరిగా పండకపోవడంతో రూ.10 లక్షల అప్పులు అయ్యాయి. దీంతో అప్పులు ఎలా తీర్చాలోఅని బాధపడుతూ ఉండేవాడు.
శుక్రవారం కౌడిపల్లిలోని బంధువుల వివాహానికి భార్యతో కలిసివెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చాడు. అనంతరం బయటకి వెళ్లి వస్తానని చెప్పి.. గ్రామ శివారులోని మంజీరా నది పరిసర ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మొయినుద్దీన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి మెదక్ ఏరియా దవాఖానకు తరలించారు.