Union Budget 2024-25 | సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ చివరి బడ్జెట్ను ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ( 2024-25) కి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్సభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ పలు రికార్డులను బ్రేక్ చేశారు. ఆరో సారి లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టి మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేసిన నిర్మలమ్మ.. తాజా బడ్జెట్లో మరో రికార్డును కూడా క్రియేట్ చేశారు.
చరిత్రలో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాలు చేసిన మంత్రుల జాబితాలో ప్రముఖంగా నిలిచిన నిర్మలమ్మ.. తన మధ్యంతర బడ్జెట్ ప్రసంగాన్ని మాత్రం చాలా తక్కవు సమయంలోనే ముగించారు (shortest budget speeches). కేవలం 58 నిమిషాలు మాత్రమే బడ్జెట్ను లోక్సభలో వినిపించారు. ఈ ప్రసంగంలో 5,246 పదాలను మాత్రమే ఉపయోగించారు. ఇప్పటి వరకూ నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే చిన్నదిగా నిలిచింది.
2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన తొలి మహిళగా చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. అదే ఏడాది కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమె.. ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు. 1970-71లో ఇందిరా గాంధీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో ఆమె తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఉన్నారు.
ఇక ఎక్కువసార్లు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా, అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన మంత్రిగా నిర్మలమ్మకు రికార్డు ఉంది. ఆమె బడ్జెట్ ప్రసంగాల్లో 2020లో చేసిన బడ్జెట్ ప్రసంగం అత్యంత సుదీర్ఘమైనది. అప్పుడు ఆమె ఏకంగా 2 గంటల 40 నిమిషాల పాటు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డు సృష్టించారు. బడ్జెట్ చరిత్రలో ఇదే ఇప్పటి వరకూ సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. ఆ బడ్జెట్లోని కీలక ప్రకటనల్లో కొత్త ఆదాయపు పన్ను స్లాబులు, ఎల్ఐసీఐపీవో, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగాలపై ఆమె సుదీర్ఘ ప్రసంగం చేశారు.
బడ్జెట్ను తొలిసారి ప్రవేశపెట్టిన 2019లో ఆమె ప్రసంగం 2 గంటల 17 నిమిషాల పాటు సాగింది. ఇది రెండో అతిపెద్ద బడ్జెట్ ప్రసంగం. ఆ ఏడాది కేంద్ర బడ్జెట్ ను తొలిసారిగా పూర్తిస్థాయిలో నిర్మలమ్మ ప్రవేశపెట్టారు. ఇక గతేడాది 87 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు.
Also Read..
Union Budget 2024-25 Highlights | మధ్యంతర బడ్జెట్లోని ముఖ్యాంశాలివే..
Cervical cancer: గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన కోసం అమ్మాయిలకు టీకాలు: మంత్రి నిర్మల
Budget 2024 | రూ.47.66లక్షల కోట్లతో బడ్జెట్.. శాఖలు, పథకాల వారీగా కేటాయింపు ఇవే..!