న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలతో ఇండిగో ఎయిర్‌లైన్స్ దిగి వచ్చింది. ఆరు రోజులపాటు విమానాల రద్దు గందరగోళం తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది. (IndiGo chaos) విమాన సర్వీసుల పునరుద్ధరణను వేగవంతం చేసింది. అలాగే ప్రయాణికులకు రూ.610 కోట్ల భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించింది. ప్రభావిత ప్రయాణికులకు సుమారు 3,000 సామగ్రిని ఇండిగో తిరిగి ఇచ్చినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
కాగా, రోజుకు సుమారు 2,300 విమానాలు ఇండిగో ఎయిర్‌లైన్స్ నడుపుతున్నది. దీంతో దేశీయ విమానయాన మార్కెట్లో దాదాపు 65 శాతం ఆ సంస్థ ఆధీనంలో ఉన్నది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికులు ఇండిగోపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో పైలట్ల కొరత ఎదురైంది. దీంతో డిసెంబర్ 2 నుంచి రోజుకు వేల సంఖ్యలో విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలతో ఇండిగో ఎయిర్‌లైన్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. శనివారం 1,500 ఆదివారం 1,650 విమానాలు నడిపింది. 138 గమ్యస్థానాలలో 135కి కనెక్టివిటీని పునరుద్ధరించింది. ఈ నెల 15 వరకు పూర్తిస్థాయిలో రిఫండ్ చెలిస్తామని ప్రకటించింది.
కాగా, ఎయిర్‌లైన్ ఆన్ టైమ్ పనితీరు 75 శాతానికి చేరుకున్నదని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు. రద్దు చేసిన విమానాల ప్రయాణికులకు పూర్తి స్థాయిలో రిఫండ్, వారి లగేజ్‌ను తిరిగి ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసినట్లు చెప్పారు. డిసెంబర్ 10 నాటికి ఇండిగో నెట్వర్క్ సాధారణ స్థితికి వస్తుందని అంచనా వేశారు.
Also Read:
Watch: హైవేపై ఏనుగుల గుంపు హల్చల్.. వీడియో వైరల్