India’s poverty : దేశంలో పేదరికం (Poverty) క్రమంగా తగ్గుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజా నివేదిక స్పష్టం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతంగా ఉన్న పేదరికం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతానికి తగ్గిందని ఎస్బీఐ తన రిపోర్టులో తెలిపింది. దేశంలో పేదరికం విషయంలో ఎస్బీఐ నివేదిక, ప్రపంచ బ్యాంక్ (World bank) నివేదిక దాదాపు ఒకే విధంగా ఉన్నాయి.
ప్రపంచ బ్యాంక్ కూడా దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతోంది. 2023లో 5.3 శాతంగా ఉన్న పేదరికం ఇప్పుడు 4.6 శాతానికి తగ్గిందని తెలిపింది. పేదరిక నిర్మూలనలో దేశం పురోగతి సాధిస్తున్నదనడానికి ఇది నిదర్శనమని ఎస్బీఐ పేర్కొంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో దేశంలో పేదరికం 27.1 శాతంగా ఉండెనని ఎస్బీఐ తన రిపోర్టులో పేర్కొంది.
ఇదిలావుంటే ప్రపంచ బ్యాంక్ ఇటీవల గ్లోబల్ పావర్టీ లైన్ను సవరించింది. గతంలో రోజుకు 2.15 అమెరికా డాలర్ల కంటే తక్కువ సంపాదన ఉన్నవారిని పేదలుగా పరిగణించగా.. ఇప్పుడు దాన్ని మూడు డాలర్లకు పెంచింది. అంటే రోజుకు రూ.260 కంటే తక్కువ సంపాదన కలిగి వారిని పేదలుగా పరిగణలోకి తీసుకుంది.
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. 2011-12లో దేశంలోని మొత్తం నిరుపేదల్లో 65 శాతం మంది కేవలం ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నారు. 2011-12లో రూరల్ ఇండియాలో 18.4 శాతం నిరుపేదరికం ఉండగా.. 2022-23లో అది 2.8 శాతానికి తగ్గింది. అదేవిధంగా 2011-12లో అర్బన్ ఇండియాలో 10.7 శాతం నిరుపేదరికం ఉండగా.. 2022-23 నాటికి అది 1.1 శాతానికి దిగివచ్చింది.