Drinking Water Tank | జైనూర్, ఫిబ్రవరి 22 : మూగ జీవాల కోసం ఏర్పాటు చేసిన త్రాగు నీటి ట్యాంక్ మురికికూపంగా మారినా పట్టించుకునే ప్రజాప్రతినిధి కరువయ్యాడు. ప్రజా ప్రతినిధులు ఎక్కడున్నారని జైనూర్ మండల కర్ణంగూడలో యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం సహించబోమని ఆ గ్రామ యువత సేవభావంతో , మన్కుగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కర్ణంగూడ గ్రామంలో పశువులు త్రాగే నీటి ట్యాంక్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని.. చాలా రోజులుగా ట్యాంక్‌లో చెత్త చెదారం పేరుకుపోయి, నీరు పూర్తిగా మురికిగా మారినా గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులు అసలు పట్టించుకోలేదని గ్రామస్థులు మండిపడుతున్నారు.
పశువుల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల గ్రామ యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి కర్ణంగూడ గ్రామానికి చెందిన యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ట్యాంక్‌లోని చెత్తను తొలగించి, మురుగు నీటిని బయటకు తీసి పూర్తిగా శుభ్రపరిచారు.“ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేదని.. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టని ప్రజాప్రతినిధులు ఎందుకు” అంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఇకపై ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ యువత డిమాండ్ చేస్తున్నారు.